PTD FITMENT: ఆర్టీసీ నుంచి ప్రజా రవాణా విభాగానికి మారిన ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. అశుతోష్‌మిశ్రా కమిటీ సిఫార్సుల మేరకు ఫిట్‌మెంట్‌ను పెంచకపోగా.. ఇప్పుడున్న దానిలో 1.6 శాతం కోత పెట్టింది. అదేసమయంలో 4.7 శాతం మేర డీఏ కలపాల్సి ఉండగా..... అందులో 1.6శాతం కోతపెట్టి 3.1 శాతాన్నే మూల వేతనంలో కలిపారు. పీటీడీ ఉద్యోగుల స్కేళ్లు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన క్యాడర్ల ఖరారుతోపాటు పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం జారీచేసింది.
ప్రజా రవాణా విభాగానికి చెందిన ఉద్యోగులకు మేలుకలిగేలా అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన వివిధ సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోలేదు. వాటికి బదులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు కోసం ఇచ్చిన నివేదికలోని స్కేళ్లను.... ఖరారు చేశారు. ఫలితంగా కీలకమైన ఫిట్‌మెంట్ విషయంలో పీటీడీ ఉద్యోగులకు నష్టం కలిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2018, జులై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు 2020, జనవరి ఒకటి నుంచి పీటీడీ ఉద్యోగులుగా విలీనమయ్యారు. వీరికి ఆర్టీసీలో ఉన్నప్పుడు 2017, ఏప్రిల్ ఒకటి నుంచి వేతన సవరణ అమలు చేశారు. దీంతో 2017 ఏప్రిల్ నుంచి 2018 జులై మధ్య 4.7శాతం డీఏను మూల వేతనంలో కలపాలని మిశ్రా కమిటీ సిఫార్సు చేసింది. అలాగే 2017లో ఆర్టీసీలో ఉన్నప్పుడు 25శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి ఖరారు చేస్తే...పీటీడీ ఉద్యోగులకు అప్పటికే ఉన్న 25శాతం ఫిట్‌మెంట్‌కు అదనంగా 1.6శాతం కలపాలని సిఫార్సు చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు 23శాతం ఫిట్‌మెంట్ ఖరారు చేయడంతో... పీటీడీ ఉద్యోగులకు 1.6 శాతం తగ్గించారు.
పీటీడీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు.. ప్రభుత్వంలో ఉన్న 32 గ్రేడ్లు, 83 దశల ప్రకారం సవరించిన మాస్టర్ స్కేళ్లలో సర్దుబాటుచేసి 2020, జనవరి నుంచి అమలు చేస్తారు.ఈడీ స్థాయి నుంచి ఏడీ స్థాయి వరకు మూలవేతనంలో కోత పడింది. డిపో మేనేజర్ నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు బేసిక్ ఇప్పటి కంటే పెరిగింది. పీటీడీ ఉద్యోగులకు ఇప్పుడున్న పే కంటే, సవరించిన స్కేల్‌లో తక్కువగా ఉంటే.. వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని పర్సనల్ పే గా ఇస్తారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఖరారు చేసిన డీఏ , హెచ్‌ఆర్‌ఏ లను పీటీడీ ఉద్యోగులకు 2020, జనవరి ఒకటి నుంచి అమలు చేస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఖరారు చేసిన సీసీఏను పీటీడీ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ను పీటీడీ ఉద్యోగులకు అమలులోకి తెచ్చారు. ఆర్టీసీలో స్పెషల్ గ్రేడ్లు 9, 18 ఏళ్లకు ఉన్నాయి. వాటి స్థానంలో ప్రభుత్వంలో ఏఏఎస్ కింద 6, 12, 18, 24 ఏళ్లకు వర్తిస్తాయి.పీటీడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ జీవిత బీమా అమలవుతుంది. పీటీడీ ఉద్యోగుల ప్రస్తుతం మాదిరే విజయవాడలోని ఆర్టీసీ సెంట్రల్ ఆసుపత్రి, ఏరియా డిస్పెన్సరీలలో వైద్య సేవలు కొనసాగిస్తారు. ఈపీఎఫ్-95లో కొనసాగుతారా? సీపీఎస్‌లో చేరతారా? అనేది ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. సీపీఎస్‌లో చేరే వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా డీసీఆర్‌జీ పథకం అమలవుతుంది. ఇప్పుడున్న ఈపీఎఫ్-95లో కొనసాగుతామనే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ గ్రాట్యుటీ విధానం ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి.