దేశంలోనే అతిపెద్ద కాంక్రీటు నిర్మాణమైన పోలవరం ప్రాజెక్టు జీవవైవిధ్య పరంగానూ ఉపకరించేలా గోదావరి నదిలోని చేపలు, ఇతర జీవజాలాలు ప్రాజెక్టుకు ఇరువైపులా స్వేచ్ఛగా తిరుగాడేలా నిర్మాణం పూర్తి అయ్యింది. స్పిల్ వే లోని రెండో స్థంభానికి అనుకుని నదిలోని జీవజాలం, చేపలు ఎగువకు, దిగువకు ప్రయాణించేలా చేపట్టిన నిర్మాణమే ఫిష్ ల్యాడర్. గోదావరిలో అదీ వరద సమయాల్లోనే అత్యంత అరుదుగా లభించే పులస చేపలు, ఇతర మత్స్య రకాల కోసం ఈ ఫిష్ ల్యాడర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 252 మీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫిష్ ల్యాడర్ నిర్మాణం నదీ ప్రవాహంతో పాటు నీటి మట్టం కనిష్టంగా ఉన్నా గరిష్టంగా ఉన్నా చేపలు, జీవజాతులూ అటూ ఇటూ తిరిగేందుకు వీలుగా నిర్మించారు. నాలుగు వెంట్ లు గా ఈ నిర్మాణం పూర్తి అయ్యింది.
చేపల రాకపోకలకు వీలుగా...
క్రస్ట్ లెవల్ స్థాయిలో 25 మీటర్ల వద్ద 1,2 వెంట్ లు, అలాగే 34 మీటర్ల ఎత్తులో మూడో వెంట్ , ఇక 41 మీటర్ల ఎత్తులో నాలుగో వెంట్ నిర్మాణం జరిగింది. క్రస్ట్ గేట్లు మూసి ఉన్నప్పటికీ ఈ వెంట్ ల గుండా నీటి ప్రవాహం మంద్రస్థాయిలోనే కొనసాగేలా ఏర్పాటు చేశారు. గోదావరిలో నీటి మట్టం అధికంగా ఉన్నా కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ చేపలు రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చేపజాతిపై అధ్యయనం చేసి మానవ నిర్మిత కట్టడం నుంచి అటూ ఇటూ స్వేచ్ఛగా తిరిగేలా ఫిష్ ల్యాడర్ ఏర్పాటు అయ్యింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సెంట్రల్ ఫిషరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనం నిర్వహించి స్పిల్ వేలోని రెండో స్పియర్ కు ఫిష్ ల్యాడర్ గేట్ ను అమర్చారు.