హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి వ్యాక్సిన్‌ను కిష్టమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలికి వేయించారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి, టిమ్స్ డైరెక్టర్ విమల థామస్, ఐపీఎం డైరెక్టర్ శంకర్ సహా 33 మందికి గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు ప్రక్రియను పర్యవేక్షించారు.
అందరికీ టీకా
వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని... ఇది అత్యంత సురక్షితమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టీకా కోసం తొందరపడొద్దని.. ప్రాధాన్య క్రమంలో అందరికీ ఇస్తామని తెలిపారు.
సేవలకు కృతజ్ఞతగా
ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా మన దేశం కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవటం ప్రజలందరికీ గర్వకారణమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన గవర్నర్.. కరోనా యోధులు అందించిన సేవలకు కృతజ్ఞతగా తొలిటీకా వేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో హైదరాబాద్ వాక్సిన్ హబ్‌గా ఉండడం అందరికీ గర్వకారణమని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తిలక్‌నగర్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకంలో అందరికీ టీకా అందుతుందని స్పష్టం చేశారు.