తెలంగాణ రాష్ట్రంలో టీకాల లభ్యత అంచనా ప్రకారం.. టీకా ప్రక్రియలో సమయానికి తగ్గట్టుగా సర్కారు మార్పులు చేస్తోంది. ప్రస్తుతం కేవలం తొలిడోసు తీసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారికి మాత్రమే టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ టీకా కేంద్రాలలో రెండో డోసు ఇస్తామని స్పష్టం చేసింది. శనివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు... ఆదివారం మినహా నాలుగు రోజులపాటు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగనుంది. ఇప్పటికే కొవాగ్జిన్ తొలిడోస్ తీసుకుని 28రోజులు, కొవీషీల్డ్ తీసుకుని ఆరు వారాలు దాటిన వారికి టీకా అందించనున్నారు. తొలిడోసు ఎక్కడ తీసుకున్నా ... నేరుగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి... రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇందుకోసం ఎలాంటి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు అక్కర్లేదని.... వ్యాక్సిన్ కేంద్రంలోనే లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
టీకాలు రెండో డోసుకూ సరిపోని పరిస్థితి
తెలంగాణలో ప్రభుత్వ , ప్రైవేటులో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో సుమారు 5 లక్షల మందికి వచ్చే వారం రోజుల్లో రెండో డోస్ వ్యాక్సినేషన్ తప్పక పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పలువురు కొవీషీల్డ్ వేసుకున్నవారు దాదాపు ఏడు వారాలు పూర్తి చేసుకోగా.. కొవాగ్జిన్ వేసుకున్న 28 రోజులు పూర్తై... రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు రెండో డోసుకూ సరిపోని పరిస్థితి ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.