రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొదటి రోజు ఏపీ ఎంసెట్ జరిగింది. మొత్తం 41,444 మంది దరఖాస్తు చేయగా.. వీరిలో 34,994 మంది పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 84.43 శాతం మంది హాజరయ్యారు. పరీక్షలో భౌతిక శాస్త్రం నుంచి వచ్చిన ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉండగా.. గణితం మధ్యస్థంగా.. రసాయన శాస్త్రం తేలికగా ఉందని శ్రీ చైతన్య, శారద విద్యా సంస్థల ప్రతినిధులు పి.వెంకటేశ్వరరావు, విఘ్నేశ్వరరావు వెల్లడించారు. ఉదయం భౌతిక శాస్త్రంలో సమయం తినే ప్రశ్నలు వచ్చాయని, ఉదయంతో పోల్చితే సాయంత్రం ప్రశ్నపత్రం తేలికగా ఉందని తెలిపారు. నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసినవారు, సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారు 150 మార్కులకుపైగానే సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భౌతిక శాస్త్రం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయి
‘‘భౌతిక శాస్త్రం ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉన్నాయి. ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడిగారు. సమయం ఎక్కువ తీసుకుంది. మంచి మార్కులు వస్తాయి. అయోమయానికి గురి చేసే ప్రశ్నలు అడిగారు’’-- తోటకూర సాయిరాం, విజయవాడ