హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం విధులు ప్రారంభమైన కొద్దిసేపటికే పరిశ్రమలోని ఓ రియాక్టర్ పేలి.. మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలుతున్నాయి. పరిశ్రమలో మొత్తం పది రియాక్టర్లు ఉండగా... ఇప్పటివరకు నాలుగు పేలిపోయాయి. మిగతావి కూడా పెలుతుండడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.
పరిశ్రమలోని హరిప్రసాద్, అర్జున్, మనిష్ బస్కీ అనే ముగ్గురు సిబ్బంది మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయలపాలవగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. విజయ్ అనే మరో కార్మికుడు కనబడటం లేదని పరిశ్రమ సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. 4ఫైరింజన్లతో పాటు... 6 నీటి ట్యాంకర్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. బాయిలర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.