ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్​ తీసుకుంటే.. సాయానికి అర్హులే - 10 MORE CORONA CASES REGISTERED IN STATE

ఈ నెలలో రేషన్‌ తీసుకున్న కుటుంబాలన్నింటికీ రూ.వెయ్యి చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం కార్డులకే ఆర్థికసాయం అనే నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ‘బియ్యం కార్డులకే ఆర్థికసాయం’ శీర్షికన ఈ నెల 3న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో కథనంపై ప్రభుత్వం స్పందించింది.

financial support to poor
రేషన్​ తీసుకుంటే.. సాయానికి అర్హులే

By

Published : Apr 5, 2020, 7:20 AM IST

బియ్యం కార్డులకే ఆర్థికసాయం అనే నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. పేదలందరికీ సాయం అందేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించడంతో..ఈ నెలలో రేషన్‌ తీసుకున్న కుటుంబాలన్నింటికీ రూ.వెయ్యి చొప్పున అందించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న పేదల్ని ఆదుకునేందుకు రూ.1,300 కోట్లు కేటాయించిన రెవెన్యూ(విపత్తు నిర్వహణ)శాఖ.. ఇందుకు 1.29 కోట్ల బియ్యం కార్డుల జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని ఈ నెల 2న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పౌరసరఫరాలశాఖ మాత్రం బియ్యం కార్డులకే కాకుండా.. పాత రేషన్‌ కార్డుల జాబితా ప్రకారం 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యం, కందిపప్పు ఉచితంగా అందిస్తోంది. రెవెన్యూశాఖ నిర్ణయంతో 18 లక్షల కుటుంబాలు ఆర్థికసాయానికి దూరమవుతున్నాయి. దీనిపై ‘బియ్యం కార్డులకే ఆర్థికసాయం’ శీర్షికన ఈ నెల 3న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో కథనం వచ్చింది. శనివారం జరిగిన సమావేశంలో సీఎం వద్ద ఈ విషయమై చర్చ జరిగింది. ఇది విపత్కర సమయమని.. నిబంధనలు పక్కన పెట్టి సాయం అందించాలని ఆయన ఆదేశించారు. దీంతో ఈ నెలలో రేషన్‌ తీసుకుంటున్న కుటుంబాలన్నింటికీ రూ.వెయ్యి చొప్పున సాయం అందించాలని అధికారులు నిర్ణయించారు. శనివారం వరకూ రేషన్‌ తీసుకున్న కార్డుదారుల వివరాలను పౌరసరఫరాలశాఖ నుంచి తీసుకున్నారు. దీని ప్రకారం బియ్యం కార్డులు లేని.. అయిదు లక్షల కుటుంబాలకు ఆదివారం నుంచి ఆర్థికసాయం అందనుంది. ఇలా రోజువారీగా జాబితాలు తీసుకుని వారందరికి రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, ఇతర కుటుంబాలకు పోర్టబిలిటీ ద్వారా సాయం అందించనున్నారు.

కందిపప్పు బదులు శనగలు

ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత రేషన్‌ పంపిణీకి కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో కార్డుకు కిలో చొప్పున శనగల్ని అందించనున్నారు. ప్రస్తుతం తొలివిడతగా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కార్డుకు కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత, ఏప్రిల్‌ 29న మూడో విడతలోనూ ఉచితంగా బియ్యంతోపాటు కిలో కందిపప్పు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. పౌరసరఫరాల సంస్థ వద్ద కందుల నిల్వలు లేవు. నాఫెడ్‌ నుంచి కేటాయింపు కోరింది. అవి వచ్చినా.. మిల్లింగ్‌, ప్యాకింగ్‌ చేయించి పంపిణీ చేసేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ శనగల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం... ఆరు రోజుల్లో 169 కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details