ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనాడు కథనానికి స్పందన.. నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థిక సాయం - నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థికసాయం చేసిన దాత అవిర్నేని శ్రీనివాసరావు

ఆర్థిక స్థోమత లేక చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న అనూషకు చేయూత లభించింది. 'వైద్య విద్యార్థినికి విద్యాగండం!' అనే శీర్షికతో 'ఈనాడు' ప్రచురించిన కథనానికి స్పందించిన సూరారం వాసి అవిర్నేని శ్రీనివాసరావు.. రూ.2లక్షల చెక్కును అందజేశారు.

Financing for a poor medical student
నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థికసాయం

By

Published : Aug 13, 2021, 8:09 PM IST

ఆర్థిక స్థోమత లేక చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న అనూషపై 'వైద్యవిద్యార్థినికి విద్యాగండం!' అనే శీర్షికతో 'ఈనాడు' ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. నిరుపేద వైద్య విద్యార్థిని అనూషకు సాయం అందించేందుకు సూరారం వాసి అవిర్నేని శ్రీనివాసరావు ముందుకొచ్చారు. విద్యార్థినికి రూ.2లక్షల చెక్కును అందించి ఆమెకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. వైద్య విద్యార్థిని అనూష ఆర్థిక కష్టాలపై గురువారం ఈనాడు కథనాన్ని ప్రచురించింది. చదువు మీద ఉన్న ప్రేమతో అనూష కూరగాయలు అమ్ముతూ చదువుకుంటోంది.

కూరగాయలు విక్రయిస్తూ..

హైదరాబాద్​ నగరం బోరబండ మోతీనగర్‌లోని ఓ గల్లీ. రోడ్డు పక్కన బండిపై కూరగాయలు విక్రయిస్తూ ఓ అమ్మాయి. ఖాళీ సమయంలో చదువుకుంటోంది. ఏంటా అని ఆరా తీస్తే తన సమస్యను చెప్పుకొచ్చింది. ఆమె పేరు అనూష. తండ్రి వాచ్‌మన్‌, తల్లి కూరగాయలు విక్రయిస్తుంటారు. తమ్ముడు చిన్న ప్రైవేటు ఉద్యోగి. అనూష డాక్టరు కావాలనే లక్ష్యంతో ఇంటర్‌లో 945 మార్కులతో పాటు నీట్‌లోనూ ఉత్తీర్ణత సాధించింది. కానీ ఎంబీబీఎస్‌ ఉచిత సీటు రాలేదు. ఆమె స్నేహితులు కిర్గిస్థాన్‌లో తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్‌ చదవబోతున్నారని తెలిసి ఆ దిశగా ప్రయత్నించారు. ప్రభుత్వ ఉపకారవేతనం కోసం టీఎస్‌ఐపాస్‌ కార్యాలయానికి వెళ్లి సంప్రదించారు. ముందు అడ్మిషన్‌ తీసుకోమని... ప్రభుత్వ సాయం వస్తుందని అధికారులు భరోసా ఇవ్వడంతో ముందడుగు వేశారు.

బంగారం అమ్మి..

అనూష తల్లి సరళ బంగారం అమ్మి.. రూ.2 లక్షల ఫీజు కట్టారు. అలా 2017లో కిర్గిస్తాన్‌లోని ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రవేశం లభించింది. మిగతా ఫీజు సొమ్ము కోసం సాయం చేయమని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంది. కానీ విదేశాల్లో పీజీ విద్యకే ప్రభుత్వ సాయం వర్తిస్తుందని, అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. చేసేదిలేక ఆమె తల్లిదండ్రులు మరో రూ.3 లక్షలు కట్టి కుమార్తెను కిర్గిస్థాన్‌ పంపారు. అనూషకు మొదటి ఏడాదిలో మెరిట్‌ మార్కులు రావడంతో రెండో ఏడాది ఫీజు కట్టకున్నా పరీక్షలు రాసేందుకు కళాశాల అనుమతిచ్చింది. తర్వాత కరోనా కారణంగా హైదరాబాద్‌ వచ్చిన అనూష.. కళాశాల యాజమాన్యాన్ని అభ్యర్థించగా మూడో సంవత్సరం పరీక్షలకూ అనుమతి ఇచ్చారు. తదుపరి ఫీజు తప్పనిసరిగా చెల్లించాలని యాజమాన్యం చెప్పడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఇంకా ప్రభుత్వం, దాతలు సాయం చేస్తే డాక్టర్​గా తిరిగొచ్చి పేదలకు సాయం చేస్తానని విద్యార్థిని చెబుతోంది.

దీనస్థితిపై ఈనాడు కథనం..

ఈ నేపథ్యంలో ఆమె దీనస్థితిని ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఈనాడు కథనాన్ని చూసిన సూరారంకు చెందిన అవిర్నేని శ్రీనివాసరావు అమ్మాయికి రూ.2 లక్షల చెక్కును అందించారు. తన స్నేహితుడు గార్లపాటి శ్రీనివాసరావు మరో రెండు లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపాడు. మరికొంత మంది విద్యార్థులు, శ్రేయోభిలాషుల సహాయంతో అనూషకు మూడు నాలుగు రోజుల్లో రూ.10 లక్షలు, ఎంబీబీఎస్ పుస్తకాలను అందిస్తామని అవిర్నేని శ్రీనివాసరావు తెలిపారు.

తనకు సహాయం అందిస్తున్న వారికి విద్యార్థిని అనూష ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇంకా దాతలు సాయం చేయాలని విద్యార్థిని కోరుతున్నారు. డాక్టర్​గా తిరిగొచ్చాక నాలాంటి పేద విద్యార్థులకు సహాయం అందిస్తానని ఈటీవీ భారత్​తో అన్నారు.

ఇదీ చదవండి:

CS Meeting with IAS officers: 'ఐఏఎస్ అధికారులూ.. సచివాలయానికి రండి!'

ABOUT THE AUTHOR

...view details