Financial Frauds in Telangana: మనుషుల అవసరాలు.. అమాయకుల నమ్మకాలు.. సామాన్యుల బలహీనతలే ఆసరాగా జరుగుతున్న మోసాలెన్నో! గుప్త నిధులంటూ కొందరు.. సులభంగా డబ్బు సంపాదన పేరుతో ఇంకొందరు.. ఉద్యోగాలిప్తిస్తామని ఒకరు.. డబ్బు రెట్టింపు చేస్తామంటూ మరొకరు.. ఇలా నమ్మకమే పెట్టుబడిగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. నిరక్షరాస్యులో, గ్రామీణులో కాదు.. ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు కూడా ఇలాంటి మోసాలకు బలవుతుండటమే విశేషం. రైస్ పుల్లింగ్ యంత్రాలు, డబ్బును రెట్టింపు చేసే యజ్ఞాలు, బంగారాన్ని మెరుగుపెట్టే రసాయనాలు.. అదృష్టాన్ని తెచ్చిపెట్టే రెండు తలల పాములు ఒకటేమిటి రకరకాల పేర్లతో మాయగాళ్లు చెలరేగిపోతున్నారు.
ఆగని రైస్‌పుల్లింగ్..
rice pulling : ‘ఇదొక అద్భుత యంత్రం. దీంతో డబ్బు రెట్టింపవుతుంది, గుప్త నిధులను కనిపెడుతుంది. మిమ్మల్ని రూ.కోటీశ్వరులను చేస్తుంది’ అంటూ రైస్‌పుల్లింగ్ యంత్రాల మాటున జరుగుతున్న మోసాలు ఇప్పటివి కావు. ఎంతమంది మోసపోతున్నా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉండడం విశేషం. ఇలా మోసం చేస్తున్న 14 మంది సభ్యుల ముఠాను తెలంగాణలోని శంషాబాద్ పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. తాజాగా ఏపీలోని చిత్తూరు పోలీసులకు కూడా ఇలాంటి ముఠా పట్టుబడింది.
డబ్బులు రెట్టింపు చేసే యజ్ఞం
money double: ఈ యజ్ఞం చేస్తే డబ్బు రెట్టింపు అవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మించేలా చేయడమే దొంగ బాబాల పని. గతంలో తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇలానే నమ్మి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. డబ్బు రెట్టింపవుతుందని చెబుతూ మొదట రూ. 5 లక్షలు పెట్టించి పూజలు చేసిన దొంగ బాబాలు అన్నట్లుగానే రూ. 10 లక్షలు ఇచ్చారు. దాంతో నమ్మకం కుదిరిన సదరు పారిశ్రామివేత్త తర్వాత రూ. 50 లక్షలు పెట్టాడు. ఆ డబ్బుతో బాబాలు ఉడాయించారు. దాంతో లబోదిబోమంటూ సదరు పారిశ్రామివేత్త పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటికీ ఇలాంటివాటిని కొందరు నమ్ముతుండటంతో పూజలు, యజ్ఞాలు చేస్తే శుభం జరుగుతుంది, కష్టాలు తొలిగిపోతాయంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పంట పండుతూనే ఉంది.
కరక్కాయలు పొడి చేయండి
monthely income : ‘ఇంట్లోనే ఉండి నెలనెలా రూ.వేలకు వేలు ఆర్జించండి’ అంటూ అనేక కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. దీనికో ఉదాహరణ కరక్కాయ పొడి మోసం. రూ.వెయ్యి పెట్టి సభ్యత్వం తీసుకుంటే కిలో కరక్కాయలు ఇస్తామని, వాటిని పొడి చేసి మళ్లీ తమకే అమ్ముకోవచ్చని ‘సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్’ అనే సంస్థ ప్రచారం చేసింది. కిలో కరక్కాయలకు రూ. 300 చొప్పున లాభం పొందవచ్చని పేర్కొంది. ఇంట్లో ఉండేదే కదా అన్న ఉద్దేశంతో వందలమంది ఎగబడ్డారు. మొదట్లో చేరిన వారికి డబ్బులు పంచిన ఆ సంస్థ తర్వాత పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి పారిపోయింది. అలానే ఆయుర్వేద గుణాలున్న మునక్కాయల పొడి చేసి ఇచ్చినా లాభం వస్తుందంటూ మరో సంస్థ చేసిన ప్రచారానికీ అనేకమంది బలయ్యారు.