అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిని ఒక నగరానికే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయటం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని సింగపూర్ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. సుస్థిర జీవనం, అన్నిచోట్లా ఉత్పాదకరంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనే ప్రభుత్వ ప్రాధమ్యాలని తేల్చి చెప్పారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణలు సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన బుగ్గన... రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్ సంస్థలు పరిమితమని తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంచుకోవటంపై దృష్టి సారించామని తెలిపారు.
కొంత సమయం పడుతుంది
అమరావతిని ప్రభుత్వం విస్మరించలేదని దానిపై నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని బుగ్గన వ్యాఖ్యానించారు. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయటం కంటే రాష్ట్రమంతా వికేంద్రీకరించటంపైనే దృష్టి సారించామన్నారు. ప్రాధాన్య రంగ అభివృద్ధిలో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, నాలుగు నౌకాశ్రయాలు, ఆక్వా, ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపైనే ప్రాజెక్టు భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం కేవలం వందరోజుల పాలనే పూర్తి చేసుకుందని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ సదస్సులో వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణంపై పెట్టుబడిదారులకు పంపుతున్న సంకేతాలను అది నిర్థారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే ప్రాజెక్టు భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఎప్పడికప్పుడు తన ప్రాధాన్యాలను మార్చు కుంటున్నప్పుడు తదనుగుణంగా గుత్తేదారులు ఆయా ప్రాజెక్టుల్లో కొనసాగాలో వద్దో నిర్ణయించుకుంటారని తెలిపారు.
రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారమైనా సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ సదస్సు సందర్భంగా స్పష్టీకరించారు.