ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BUGGANA: రుణాలకు గవర్నర్ పేరు ఉపయోగిస్తే తప్పేంటి..? - ఏపీ ఎస్డీసీ రుణాలు

గవర్నర్ ఆమోదంతోనే..జీవోలు, ఇతర నిర్ణయాలపై ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రుణం కోసం ప్రభుత్వం తన పేరు వాడటంపై.. గవర్నర్ బిశ్వభూషణ్ అసంతృప్తిగా ఉన్నారన్న మీడియా ప్రశ్నలపై బుగ్గన స్పందించారు. గవర్నర్ ప్రశ్నిస్తే స్పష్టత ఇస్తామని ప్రకటించారు.

finance minister clarity on SDC loans
finance minister clarity on SDC loans

By

Published : Nov 2, 2021, 4:39 PM IST

Updated : Nov 3, 2021, 4:54 AM IST

ఎస్డీసీ రుణాల విషయంలో జరుగుతున్న వివాదం రాజకీయాలు చేయడం సరికాదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) ద్వారా రుణాల కోసం జరిగే ఒప్పందాల్లో గవర్నర్‌ పేరును ఉపయోగిస్తే తప్పేమిటని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. జీఓలు, ప్రభుత్వ నిర్ణయాలు కార్యకలాపాలు రాష్ట్ర గవర్నర్‌ పేరుమీదే జరుగుతాయన్నారు. గవర్నర్‌ కోరితే వివరణ ఇస్తామన్నారు. గవర్నర్‌ వివరణ అడిగారో లేదో తనకు తెలియదని, సందర్భానికి తగ్గట్లు వివరణ అడగడం సహజమని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ పేరును ఏపీఎస్‌డీసీ ఒప్పంద పత్రాల్లో పేర్కొన్న విషయాన్ని విలేకర్లు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి సంస్థ చట్టసభల ద్వారా ఏర్పడిందని.. దీనిద్వారా తెచ్చే నిధులను అమ్మ ఒడి, రైతు భరోసా, ఆసరా, చేయూత పథకాల కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశాయో గమనించాలన్నారు.

సౌలభ్యం కోసం ఆర్థిక శాఖ పరిధిలోకి...!

వాణిజ్య పన్నుల శాఖ కేటాయింపు అనంతరం తొలిసారిగా విజయవాడ-2 డివిజన్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘చాలా రాష్ట్రాల్లో వాణిజ్య పన్నులశాఖ ఆర్థిక శాఖలో అంతర్భాగంగా ఉంది. రాష్ట్రంలోనూ గతంలో వాణిజ్య పన్నులశాఖ ఆర్థికశాఖ పరిధిలోనే ఉండేది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోన్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలకు నేనే హాజరవుతున్నా. పాలనాపరమైన సౌలభ్యం కోసం ఈ శాఖ ఆర్థిక శాఖ పరిధిలోనే ఉండాలని సీఎం భావించారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా అభ్యంతరం లేదన్నారు. జీఎస్టీ అమల్లో భాగంగా నష్ట పరిహారం కింద కేంద్రం నుంచి ఇంకా రూ.2వేల కోట్లు రావాల్సి ఉంది’ అని తెలిపారు.

మంత్రి బుగ్గన

3,4 రోజులు ఆలస్యమైనా వేతనాలు ఇస్తున్నాం కదా!

ఉద్యోగులకు 3, 4 రోజులు ఆలస్యమైనా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోందని, దీనిని ఎందుకు రాజకీయం చేస్తారని బుగ్గన ప్రశ్నించారు. కొవిడ్‌ కారణంగా ఆర్థికంగా దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ‘పలువురు ఉద్యోగులు నాతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం పెద్ద విషయం కాదన్నారు. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం కూడా సహజమే’ అని మంత్రి వ్యాఖ్యానించారు. కాగ్‌ నివేదికల్లో వ్యక్తం చేసే అభ్యంతరాలకు వివరణలు ఇవ్వడం పరిపాలనా వ్యవహారాల్లో సాధారణ విషయమన్నారు. పొరపాటు లేకుండా వంద శాతం జరిగితే ఇక కాగ్‌ ఎందుకని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: మేము చెప్పింది వినకపోతే.. మీ మాటలు వినాల్సిన అవసరం లేదు: హైకోర్టు

Last Updated : Nov 3, 2021, 4:54 AM IST

ABOUT THE AUTHOR

...view details