ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వస్తున్న ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారని ఆర్థికశాఖ ఆర్టీసీని అడుగుతోంది. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం, ఆర్థికశాఖ మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిన తర్వాతే ఎంత ఇవ్వగలమనేది చెప్పగలమని... అందుకు కొంత సమయం పడుతుందని ఆర్టీసీ చెబుతోంది. ఏపీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న 52 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయనున్నారు. ప్రజా రవాణా శాఖలో ఉద్యోగులుగా వీరిని చూపనున్నారు. ఈ మేరకు రెండు బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. జనవరి ఒకటి నాటికి విలీనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత కార్మికుల జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారంటూ ఆర్థిక శాఖ అడుగుతోంది.
జీతాల భారం తగ్గుతుంది కదా...
విలీనం తర్వాత జీతాలను ప్రభుత్వం చెల్లిచనుండటంతో ఆర్టీసీపై ఏటా 3,300 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుందని ఆర్థిక శాఖ చెబుతోంది. అందుకే ఆదాయంలో కొంత తమకు ఇవ్వాలని కోరుతోంది. అయితే గత నాలుగేళ్లలో డిజిల్ ధరల పెరుగుదల, ఇతర ఖర్చుల వల్ల 6,735 కోట్ల రూపాయల నష్టాలతో పాటు, బ్యాంకు రుణాలు 2,995 కోట్లు, కార్మికులకు చెందిన ఈపీఫ్ ట్రస్ట్ ఫండ్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్)కి జమ చేయాల్సిన మెుత్తం, కార్మికులకు చెల్లించాలల్సిన ఇతర బకాయిలు కలిపి 3,740 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వీటిని సర్దుబాటు చేసుకున్న తర్వాతే ప్రభుత్వానికి కొంత మెుత్తం ఇవ్వడంపై ఆలోచిస్తామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఇందుకు దాదాపు రెండేళ్లు పడుతుందిని ఆ సంస్థ పేర్కొంటోంది. ఆదాయంలో 30 శాతం వరకు ఇవ్వడంపై ఆర్టీసీ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ మాత్రం ఇంకా ఎక్కువ శాతం ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఏటా 1,200 కోట్ల రూపాయల నష్టం...
ఛార్జీలు , పార్సిల్ సర్వీసులు, స్థలాలు, దుకాణాలకు వచ్చే అద్దె తదితరాలన్నీ కలిపి ఏటా 6 వేల కోట్లకు పైగా రాబడి ఉండగా, కార్మికుల జీతభత్యాలు, డీజిల్ ఖర్చు, బస్సుల నిర్వహణ తదితరాలకు 7,200 కోట్ల వరకు వ్యయమవతోంది. అంటే ఏటా సగటున 1,200 కోట్ల మేర నష్టం వస్తోంది.
ఇదీ చదవండి: ద్వారకా తిరుమలలో సాంకేతికత.. విద్యుత్, నీరు పదిలం