BUDGET: అనేక సవాళ్ల మధ్య కొత్త బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు మొదలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక ప్రభుత్వశాఖలకు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగినా ఖర్చు అందుకు తగ్గ రీతిలో లేదు. నిధులు అందుబాటులో లేకపోవడం, ప్రతి ప్రభుత్వ శాఖలో బిల్లులు పెండింగులో ఉండటం వంటి సవాళ్ల మధ్య పనులు ముందుకు సాగలేదు. పనులు చేసేందుకు, సరకులు సరఫరా చేసేందుకూ గుత్తేదారులు, సరఫరాదారులు వెనకడుగు వేస్తున్నారు. కరోనా అనంతరం రాష్ట్ర రాబడులు ఈ మధ్య పెరుగుతున్నాయి.
మరోవైపు కరోనా మూడోదశ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రెండు మూడు ఆర్థిక సంవత్సరాలుగా బడ్జెట్ ప్రతిపాదనల మొత్తంలో పెద్దగా మార్పు లేదు. ఎప్పటికప్పుడు అంచనా పెరగాల్సి ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా సవాలు వల్ల అనేక పరిమితులతో బడ్జెట్ రూపొందించాల్సి వస్తోందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ కసరత్తు సోమవారం ప్రారంభం కాబోతోంది.
2022-23 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోపు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. ఎన్నికలు, కరోనా కారణంగా వరుసగా మూడేళ్లు తొలుత ఓటాన్ అకౌంట్ సమర్పించడమో, లేదా ఆర్డినెన్సు తీసుకురావడం వల్ల ఇటీవల నిర్దిష్ట కాలపరిమితి లోపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభకు సమర్పించే వీలు చిక్కలేదు.
ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు అవసరమైన ఏర్పాట్ల దిశగా ఆర్థికశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు వారంరోజుల పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటుచేశారు.