వంశధారపై నిర్మించాల్సిన నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రితో చర్చలకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయంపై ఒడిశా సీఎంకు ఆయన లేఖ రాసిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. ఆ సమాధానం కోసం ఎదురుచూడకుండా చర్చలను ఖరారు చేయాలని అధికారులకు జగన్ సూచించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జంఝావతి నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టాలన్నారు. జలవనరుల ప్రాజెక్టుల పురోగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో సీఎం సమీక్షించారు. గాలేరు నగరి, హంద్రీనీవా పథకాలను అనుసంధానించే ఎత్తిపోతల పథకం పనుల్ని తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. పులివెందుల సూక్ష్మ నీటి పథకం పనులు తక్షణమే చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
తోటపల్లి ప్రాజెక్టుతో పాటు విజయనగరం జిల్లాలో ఇతర ప్రాజెక్టులకూ కలిపి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే మొత్తం పూర్తి అవుతాయని సీఎం పేర్కొన్నారు. వాటి కోసం ప్రతి నెలా కొంత మొత్తం నిధులు కేటాయించాలని చెప్పారు. తొలుత పూర్తి చేయాలనుకున్న వెలిగొండ, అవుకు టన్నెల్, నెల్లూరు, సంగం బ్యారేజీ, కొరిశపాడు ఎత్తిపోతల, వంశధార, నాగావళి అనుసంధానం పనులు తదితరాలపై ఈ సందర్భంగా సీఎం సమీక్ష చేపట్టారు. కరోనా కారణంగా కూలీలు అందుబాటులో లేక పనులకు కొంత ఇబ్బంది కలిగిందని అధికారులు తెలిపారు.
టన్నెల్ పనుల్ని వేగంగా చేయాలి
వెలిగొండ సొరంగం పనులు నవంబరు ఆఖరుకు పూర్తవుతాయని, డిసెంబరు మొదటి వారంలో నీరు విడుదలకు సిద్ధం చేస్తున్నామని అధికారులు వివరించారు. అవుకు టన్నెల్-2 పనులు అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని, అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీరు వెళ్లేలా ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు. రెండో టన్నెల్ పనుల్నీ వేగంగా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. నెల్లూరు బ్యారేజీలో మొత్తం మీద 87 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. సంగం బ్యారేజీ నవంబరు నాటికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. వంశధార-నాగావళి అనుసంధానం పనుల తీరుపైనా జగన్ సమీక్షించారు. డిసెంబరు చివరి నాటికి ఈ పనులు పూర్తి అవుతాయన్న అధికారులు వంశధార రెండో దశ పనులు మార్చి నాటికి చేస్తామన్నారు.