berths full in trains for pongal: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారీ ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. తక్కువ ఖర్చుతో రైళ్లో ఊరెళదామని ఆశపడితే నిరాశ తప్పదు. హైదరాబాద్ నుంచి ఏపీకు వెళ్లే అన్ని రైళ్లలో పండుగ ముందు 3 రోజుల్లో బెర్తులన్నీ నిండిపోయాయి. అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో కనీసం టికెట్లు బుకింగ్ చేసుకునేందుకూ అవకాశం లేకుండా రిగ్రేట్ వస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లలో గోదావరి, ఫలక్‌నుమా, చార్మినార్,ఈస్ట్‌కోస్ట్, శాతవాహన, నర్సాపూర్, కృష్ణా, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వీటన్నింటిలోనూ బెర్తులు ఇప్పటికే నిండిపోయాయి. టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు వచ్చే ప్రయాణికులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. విజయవాడ నుంచి పలు జిల్లాలకు వెళ్లే అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.
ఛార్జీలు పెంచేసిన ప్రైవేట్ ట్రావెల్స్..
అటు.. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులను దోచుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ యాజమానులు సిద్దమవుతున్నారు. పండుగ ముందు 3 రోజుల్లో పలు ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసుల టికెట్ ధరలను డిమాండ్‌ను బట్టి మూడింతలు పెంచేశారు. వీటన్నింటికీ ఆన్ లైన్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు.