ఏపీ గేమింగ్ చట్టంలో సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో డిసెంబర్ 6 లోపు కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ కృష్ణమోహతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్‌లను నిషేధిస్తూ సెప్టెంబర్ 25న చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆన్లైన్ జూదం నిర్వహించినా, ఆడినా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలు కల్పించింది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ ప్లే గేమ్స్ 24/7 ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ చేయడానికి మూడు వారాలు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అంత సమయం ఇవ్వద్దంటూ ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం డిసెంబర్ 6 లోగా కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.