ఆంధ్రప్రదేశ్

andhra pradesh

15 tenders for same work: ఒకే పనికి 15 సార్లు టెండర్లు

15 tenders for same work: బెల్లం చుట్టూ ఈగలు, వానాకాలంలో దోమలు ఎలాగో... ప్రభుత్వ పనులంటే గుత్తేదారులు అలాగే వాలిపోతారు.! ఏదో ఒక మార్గంలో ఎలాగైనా టెండర్‌ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి తారుమారైంది. రండిబాబూ రండి అని మొత్తుకున్నా... గుత్తేదారులు మా వల్ల కాదంటూ మొహం చాటేస్తున్నారు. రాష్ట్రంలోని పుర, నగరపాలికల్లో ఒక్కో ఇంజినీరింగ్‌ పనికి 15 సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదు. రెండేళ్లుగా పోగుబడిన బిల్లులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Aug 31, 2022, 8:37 AM IST

Published : Aug 31, 2022, 8:37 AM IST

15 tenders for same work
ఒకే పనికి 15 సార్లు టెండర్లు

15 tenders for same work: ఒకప్పుడుపుర, నగరపాలక సంస్థల్లో పనులంటే గుత్తేదారులు పోటీ పడేవారు. పనులు దక్కించుకోవడానికి అంచనా విలువ కంటే తక్కువ శాతానికి టెండర్లు వేసేవారు. పూర్తయిన వెంటనే చెల్లింపులూ జరిగేవి. ఇప్పుడు... గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఇంజినీర్లు బతిమలాడుతున్నా టెండర్లు వేయడం లేదు. అత్యధిక చోట్ల 7 నుంచి 15 సార్లు టెండర్లు పిలుస్తున్నారు.

ఎందుకిలా?:పనులు పూర్తి చేశాక గుత్తేదారులు బిల్లుల కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన వాటికి బిల్లులకు ఏడాదిన్నరపాటు గుత్తేదారులు పోరాటమే చేశారు. దీంతో 15వ ఆర్థిక సంఘంతో పాటు సాధారణ నిధులతో పిలిచే కొత్త పనులకు టెెండర్లు వేయడం లేదు.

నిధుల సమస్యా?:పుర, నగరపాలక సంస్థల ఖాతాల్లో తగినన్ని నిధులు ఉన్నాయి. పుర కమిషనర్ల నుంచి బిల్లుల చెల్లింపు ఆర్థిక శాఖ చేతుల్లోకి వెళ్లింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.

పుర, నగరపాలక సంస్థల్లో వివిధ పనులకు టెండర్లు వేసే గుత్తేదారులు కరవవుతున్నారు. కొన్ని పనులకు 10-15 సార్లు పిలుస్తున్నా స్పందన ఉండటం లేదు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు భరోసా కల్పిస్తున్నా.. గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.3,102 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. వీటిలో నుంచి పుర, నగరపాలక సంస్థల, నగర పంచాయతీలకు దాదాపు రూ.800 కోట్లకుపైగా కేటాయించారు. వీటితో పాటు సాధారణ నిధులతో రహదారులు, ప్రజారోగ్యం, తాగునీటి సరఫరాను మెరుగుపరిచే పనులకు పట్టణ స్థానిక సంస్థలు టెండర్లు ఆహ్వానిస్తున్నాయి. అయినా స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది.ఒ

ఎక్కడెక్కడ ఎలా అంటే...
* విజయవాడ నగరపాలక సంస్థలో 14, 15 ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు రూ.20 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణ నిధులతో చేసిన పనులకు మరో రూ.25 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. గుత్తేదారులు ముందుకు రాని కారణంగా కొత్త స్టాండర్డ్‌ ఆఫ్‌ షెడ్యూల్డ్‌ రేట్లు (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారం అంచనాలు మరోసారి సవరిస్తున్నారు.

* మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో సుమారు రూ.250 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. తాజాగా మరో 300 పనులకు పిలిచిన టెండర్లలో కొన్నింటికి స్పందన లోపించడంతో నాలుగైదు సార్లు మళ్లీ ఆహ్వానించారు.

* గుంటూరు నగరపాలక సంస్థలో 15వ ఆర్థిక సంఘంతో పాటు సాధారణ నిధులు సుమారు రూ.30 కోట్లతో 130 పనులకు పిలిస్తే కేవలం మూడింటికే గుత్తేదారులు స్పందించారు. ఒక పనికి ఏకంగా 15 సార్లు ఆహ్వానించినా ఒక టెండరు దాఖలు కాలేదు.

* చిత్తూరు నగరపాలక సంస్థలో రూ.7.14 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో రహదారులు, కాలువల పనులకు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రాలేదు. మరోసారి పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘంలో ఇటీవల రూ.65.05 లక్షలతో 20 పనులకు పిలిస్తే...9 పనులకే గుత్తేదారులు ముందుకొచ్చారు.

ఒకే పనికి 15 సార్లు టెండర్లు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details