ప్రాంతీయ రింగ్‌రోడ్డు మార్గ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదులుతోంది. గూగుల్ మ్యాప్ ఆధారంగా రోడ్డు మార్గాన్ని రూపొందించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి రహదారి నిర్మించాలన్న అంశంపై అధ్యయనం చేసేందుకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది
అందుకోసం భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు ప్రత్యేకాధికారులతోపాటు జిల్లాల వారీగా తహసీల్దార్లను నియమించాలని కోరింది. ఆ మేరకు ఒక సీనియర్ అధికారితో పాటు ప్రతి జిల్లాకు ఇద్దరు, ముగ్గురు తహసీల్దార్లను నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత వీరిని ఖరారు చేయనున్నట్లు తెలిసింది.