కరోనా ఆపత్కాలంలో కాసుల దందా సాగిస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ఒంగోలులో ఆదిత్య జనరల్ వైద్యశాల పేరుతో నకిలీ కార్పొరేట్ ఆసుపత్రిని నిర్వహిస్తూ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని.. టాస్క్ఫోర్స్అధికారులు పట్టుకున్నారు. బీ ఫార్మసీ చదివిన శ్రీనివాసరెడ్డి.. మందుల షాపు పెట్టుకునే అర్హతతో ఏకంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడని గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా రోగులును.. వేరే కొవిడ్ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు చెప్పారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట అంజిరెడ్డి ఆస్పత్రిలో విజిలెన్స్అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ బాధితుడి నుంచి 5 రోజుల వైద్యానికి 3లక్షల 38వేలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ వైద్య చికిత్సలతో పాటు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కోసం బాధితుడి నుంచి ఎక్కువ వసూలు చేసినట్లు విజిలెన్స్ఎస్పీ జాషువా వెల్లడించారు. కొవిడ్ చికిత్స చేసేందుకు ఆసుపత్రికి అనుమతి లేదన్నారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా మృతదేహాలతో మార్చురీ నిండిపోయింది. మార్చురీలో ఖాళీ లేకపోవడంతో మృతదేహాలను భద్రపరిచేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. సొంతంగా ఫ్రీజర్లు తెచ్చుకోవాలని చెబుతున్నారని.. బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన ఓ వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ చనిపోగా.. తిరుపతి గోవిందధామంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అందువల్ల మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచమని సిబ్బందిని కోరగా.. ఫ్రీజర్ తెప్పించుకోవాలని, లేదంటే 5 వేలు ఇవ్వాలని డిమాండ్చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన చెందారు.