Telangana Road Accidents Today News: తెలంగాణలోఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
బస్సు బోల్తా
Khammam RTC Bus Accident Today: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేడ్కర్ నగర్ వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తూ... రాత్రి ఒంటిగంట సమయంలో రోడ్డుపై ఉన్న గుంతలు తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా... పది మందికి గాయాలయ్యాయి.
తప్పిన పెను ప్రమాదం
వైరా సీఐ వసంత్ కుమార్, తల్లాడ ఎస్సై సురేశ్, సర్పంచ్ కిరణ్... సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రహదారిపై బస్సు బోల్తా పడటంతో ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.