ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్బీకేల ద్వారా రైతులకు కొరవడిన భరోసా.. నామమాత్రంగానే విత్తనాలు, ఎరువుల విక్రయాలు - farmer assurance centers news

పేరుకే రైతుభరోసా కేంద్రాలు. అక్కడ అందుతున్న సేవలు, భరోసా మాత్రం నామమాత్రమే అని... ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అరకొర సేవలే అందుతున్నాయి. ఆర్​బీకేలపై ప్రభుత్వ ప్రచారానికి, వాస్తవ పరిస్థితులకు పొంతనే ఉండటం లేదు

farmer assurance center
farmer assurance center

By

Published : Mar 18, 2022, 4:35 AM IST

Updated : Mar 18, 2022, 6:17 AM IST

గ్రామాల్లో విప్లవం సృష్టిస్తున్నాయని, దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని ప్రభుత్వం చెప్పే రైతు భరోసా కేంద్రాల్లో ఒక్కో దాంట్లో పట్టుమని 10 లీటర్ల పురుగు మందులూ అమ్మకం కాలేదు. పాతిక కిలోల విత్తనాలనూ విక్రయించలేదు. వెయ్యి బస్తాల ఎరువులను అందించలేకపోయారు. ఆర్‌బీకేల ద్వారా అందించే సేవలపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు గురువారం శాసన మండలికి ప్రభుత్వమిచ్చిన సమాధానంలోనే ఇది స్పష్టమవుతోంది. 2019 అక్టోబరులో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు ‘పెద్ద ఎత్తున’ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పే మాటల్లో నిజమెంతో ఈ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా 95,571 లీటర్ల పురుగు మందులు విక్రయించినట్లు చెప్పింది. అంటే ఒక్కో ఆర్‌బీకేలో సగటున 9 లీటర్ల పురుగు మందులు అమ్మగలిగారు. చిన్న పురుగు మందుల దుకాణంలోనూ ఇంతకు 200 రెట్ల అమ్మకాలుంటాయి. మోస్తరు దుకాణంలోనైనా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ్యాపారం చేస్తారు. మొత్తం విక్రయించిన పురుగు మందుల్లో ప్రభుత్వ పథకాల కింద రైతులకు రాయితీపై ఇచ్చేవీ ఉన్నాయి. వాటిని తీసేస్తే రైతులు సొమ్ము చెల్లించి కొనుక్కున్న పురుగు మందులు నామమాత్రమే. కౌలు రైతులకు 9.37 లక్షల సీసీఆర్‌సీ కార్డులు (సాగుదారు ధ్రువపత్రాలు) ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కో ఆర్‌బీకే పరిధిలో వందలాది కౌలు రైతులుంటే ఇచ్చిన కార్డులు సగటున 87 మాత్రమే.

ఆర్బీకేల ద్వారా రైతులకు కొరవడిన భరోసా.. నామమాత్రంగానే విత్తనాలు, ఎరువుల విక్రయాలు

ఒక్కో ఆర్‌బీకేలో 780 బస్తాల ఎరువుల అమ్మకం

ఆర్‌బీకేల్లో మొత్తం 4.19 లక్షల టన్నుల ఎరువులు విక్రయించినట్లు ప్రభుత్వం వివరించింది. రాష్ట్రంలోని 10,778 రైతు భరోసా కేంద్రాలకు పరిశీలిస్తే ఒక్కో ఆర్‌బీకే ద్వారా సగటున 39 టన్నుల ఎరువులేఅమ్మారు. అంటే 780 బస్తాలను విక్రయించారు. ప్రైవేటు వ్యాపారులకు కేటాయింపుల్లో కోత పెట్టడంతోపాటు సహకార సంఘాల ద్వారా అమ్మకాలను నియంత్రించిన ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ఎరువుల విక్రయాలకు ప్రాధాన్యమిచ్చింది. ప్రతి గ్రామంలోనూ గోదాములు ఏర్పాటుచేయించి మరీ అమ్మకాలు చేయించింది. ప్రత్యేక దృష్టి పెట్టినా ఒక్కో ఆర్‌బీకే పరిధిలో వెయ్యి బస్తాలైనా అమ్మలేకపోయారు.

ఒక్కో కేంద్రానికి 13 కిలోల విత్తనాలే

ఆర్‌బీకేల ద్వారా మొత్తం 1,390 క్వింటాళ్ల విత్తనాలను విక్రయించారు. ఒక్కో ఆర్‌బీకేను పరిశీలిస్తే సరాసరి 13 కిలోల లెక్క వస్తుంది. ఇందులోనూ పశు సంవర్థకశాఖ ద్వారా అందించే గడ్డి విత్తనాలు కలిసే ఉంటాయి. ఒక గ్రామంలో వెయ్యి ఎకరాలు పత్తి వేశారనుకున్నా 2వేల ప్యాకెట్ల విత్తనాలు కావాలి. ఒక్కోటి 450 గ్రాముల చొప్పున చూస్తే 900 కిలోల విత్తనాలు అవసరం. మొత్తంగా చూస్తే ఒక్కో ఆర్‌బీకేలో ఎకరం సాగుకు అవసరమయ్యే వరి విత్తనంపాటి వ్యాపారమూ జరగలేదని స్పష్టమవుతోంది. రైతులనుంచి ఎక్కువ డిమాండు ఉండే మిరప, పత్తి విత్తనాలను ప్రత్యేకంగా ఆర్‌బీకేలకు కేటాయిస్తేనే ఈ మేరకైనా అమ్మకాలు సాగాయి. ఇవికాకుండా రాయితీపై 18.23 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు.

అరువుపైనే ఆధారపడుతున్న రైతాంగం

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్ల విషయంలో రైతులు అరువుపైనే ఆధారపడుతున్నారు. అప్పు తీసుకుని పంట చేతికి రాగానే వారికి విక్రయించడమో, మార్కెట్‌లో విక్రయించాక వచ్చిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించడమో చేస్తుంటారు. అదే రైతు భరోసా కేంద్రంలో అయితే ముందుగా సొమ్ము చెల్లించాలి. ఆర్డరు పెట్టాక విత్తనాలు, పురుగు మందులు వస్తాయి. ఈలోగా వాన కురిస్తే విత్తనం వేయలేరు. పురుగు భయపెడుతున్నా మందు పిచికారీ చేయలేరు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని గుర్తించకుండా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సహా అన్నీ అమ్మేస్తున్నామని చెబుతోందని రైతుసంఘాల నేతలు పేర్కొంటున్నారు.

కొరవడిన స్పష్టత:రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృత సేవలందించాలనేది లక్ష్యం. ఆధునిక సాంకేతికత, పంటల సాగుపై శిక్షణల ద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. క్రమంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలు చేపట్టారు. రైతు భరోసా, ఈ-పంట నమోదు, పంటల బీమా, పంట ఉత్పత్తుల సేకరణకు చర్యలు, రాయితీ విత్తనాలు, పంటనష్టం వివరాల సేకరణ, సీసీఆర్‌సీ కార్డులు, సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ పొలంబడి, పీఎం కిసాన్‌, పంటకోత ప్రయోగాలు, రైతులకు పంట రుణాలు ఇప్పించడం, తెగుళ్లను గుర్తించి యాప్‌లో నమోదు చేయడం, పంట నిర్వహణ పద్ధతులపై శిక్షణ, ధాన్యం సేకరణ, సామాజిక అద్దె యంత్రాల కేంద్రాల ఏర్పాటు, వారికి రుణాలు ఇప్పించడం, పంటలవారీ ధరలను సీఎం యాప్‌లో నమోదు చేయడం, తదితర ఎన్నో కార్యక్రమాల అమలు బాధ్యత అక్కడుండే వ్యవసాయ సహాయకులపై ఉంచారు. ఇవి కాకుండా పంచాయతీ కార్యదర్శులు చెప్పే ఇతర పనులనూ చేయాలి. వీటన్నింటి మధ్య వ్యాపారమా? విస్తరణ సేవలా? అనేది ప్రశ్నార్థకమే. కీలకమైన వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల అమలు ప్రశ్నార్థకంగా తయారైందని పలువురు అధికారులే పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:Lokesh News: తెదేపా అలా చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా ?: లోకేశ్​

Last Updated : Mar 18, 2022, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details