ఫిబ్రవరి15 నుంచి జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల వద్ద వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు అక్కడ రెట్టింపు నగదు వసూలు చేస్తున్నారు. తెలంగాణల రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాయకల్, శాఖపూర్, పుల్లూరు వద్ద టోల్ ప్లాజాలుండగా 85శాతం వాహనాలు ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుములు చెల్లిస్తున్నాయి. 15శాతం వాహనాలకు ఫాస్టాగ్ లేక రెట్టింపు రుసుమును వసూలు చేస్తున్నారు. అయితే కొందరు వినియోగదారులకు మాత్రం ఫాస్టాగ్ ఉన్నా అధికంగా రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టోల్‌ప్లాజాల వద్ద వివిధ సంస్థలు ఫాస్టాగ్‌లు విక్రయిస్తున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ పత్రం, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని జారీ చేస్తున్నాయి. తొలుత బాగానే పనిచేసే ఫాస్టాగ్‌లను... కేవైసీ వివరాలు లేవనే సాకుతో బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నారు. ఆ సమాచారం తీరా... టోల్‌ప్లాజాకు చేరుకున్న తర్వాత గానీ వాహనదారుడికి తెలియట్లేదు. అప్పటికప్పుడు చేసేదిలేక రెట్టింపు నగదు చెల్లించి టోల్గేట్ దాటుతున్నారు.
ఫాస్టాగ్ రీఛార్జ్ చేసేందుకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. తీరా టోల్‌ప్లాజాకు చేరుకున్నాక ఖాతాలో డబ్బులు లేవని తెలిసి..... రెట్టింపు చెల్లించాల్సి వస్తోంది. సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..టోల్ గేట్ నిర్వహకులు, ఫాస్టాగ్ సంస్థలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.