ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్యాగ్‌ లేని వాహనాలను టోల్‌ ప్లాజాల వద్ద అనుమతించరు - ఫాస్టాగ్‌ వార్తలు

టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి ఒకటో తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ఉన్న నాలుగు లేదా అంతకుమించిన చక్రాలున్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలిచ్చింది. పొరపాటున ఫాస్టాగ్‌ లేని వాహనం టోల్‌ప్లాజా వరుసలోకి వచ్చిన పక్షంలో రెండింతల మొత్తాన్ని టోల్‌ట్యాక్స్‌గా వసూలు చేయాలని స్పష్టంచేసింది.

fast-tag-must-and-should-from-january
ట్యాగ్‌ లేని వాహనాలను టోల్‌ ప్లాజాల వద్ద అనుమతించరు

By

Published : Dec 27, 2020, 10:40 AM IST

ఫాస్టాగ్‌ లేని వాహనం టోల్‌ప్లాజా వరుసలోకి వస్తే రెండింతల మొత్తాన్ని టోల్‌ట్యాక్స్‌గా వసూలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని నిర్ణయించిన కేంద్రం.. జనవరి ఒకటో తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ఉన్న నాలుగు లేదా అంతకుమించిన చక్రాలున్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు వరుసల్లో మాత్రమే నగదు చెల్లింపులు

ఈ నూతన విధానాన్ని 2017 నుంచి అమల్లోకి తెచ్చిన కేంద్రం, నగదు రూపంలోనూ చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. గడిచిన ఏడాది నుంచి ప్రతి టోల్‌ప్లాజా పరిధిలో రెండు వరుసల్లో మాత్రమే నగదు చెల్లింపులను అనుమతించింది. ఇక నుంచి ఆ వరుసల్లోనూ ఎలక్ట్రానిక్‌ చెల్లింపులనే అనుమతించాలని నిర్ణయించింది. లేనివాళ్లు సమకూర్చుకునేందుకు వీలుగా ప్రతి ప్లాజా వద్ద కనిష్ఠంగా రెండు, గరిష్ఠంగా ఎనిమిది వరకు ఫాస్టాగ్‌ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి టోల్‌ప్లాజాకు కిలోమీటరు ముందు నుంచి విక్రయం, రీఛార్జి తదితర సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశాలిచ్చింది.

తెలంగాణలో 75 శాతం వాహనాలకే

దేశవ్యాప్తంగా సుమారు 70 శాతం వాహనాలకు ఫాస్టాగ్‌ ఉన్నట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ సుమారు 75 శాతం వాహనాలకు ఇవి ఉన్నట్లు అంచనా. కేంద్రం తాజా మార్గదర్శకాల నేపథ్యంలో మిగిలిన వాహనదారులకు కూడా వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా లభ్యతను విస్తృతం చేయాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. అన్ని బ్యాంకుల శాఖలతోపాటు, రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజా వద్ద విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. విక్రయాలు 24 గంటలూ జరిగేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలిచ్చింది. వీటి పర్యవేక్షణకుగానూ ప్రతి ప్లాజా వద్ద నోడల్‌ అధికారిని నియమించాలనీ సూచించింది.

21 ప్లాజాలు.. 78 శాతం ఈ-చెల్లింపులు

తెలంగాణ రాష్ట్రం నుంచి పలు జాతీయ రహదారులపై 21 ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నాయి. అన్నింటి పరిధిలో ప్రస్తుతం సాధారణ రోజుల్లో సుమారు మూడు లక్షల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగలు, వరుస సెలవులు వచ్చిన సందర్భాల్లో ఆ సంఖ్య మరో లక్షవరకు పెరుగుతోంది. ‘‘రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల నుంచి రాకపోకలు సాగించే వాహనాల్లో 77.59 శాతం నుంచి ఫాస్టాగ్‌ ద్వారానే పన్ను వసూలవుతోంది. మరో 0.41 శాతం వరకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల రూపంలో వస్తోంది. సెలవు రోజుల్లో 78 నుంచి 81 శాతం వరకు ఇదే విధంగా వసూళ్లు జరుగుతున్నాయి. ప్లాజాలన్నింటిలోనూ ఫాస్టాగ్‌ అనివార్యం చేస్తే చెల్లింపుల శాతం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఈ విధానంతో పన్ను వసూలు సులభతరం కావటంతోపాటు, వాహనాలు ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని’ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. రాష్ట్రంలోని 200 ప్రాంతాల్లో ఇప్పటికే విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపిన ఆయన, అన్ని ప్లాజాల వద్ద 200 మంది మార్షల్స్‌ను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడకు రెండు అత్యాధునిక సరకు రవాణా నడవాలు

ABOUT THE AUTHOR

...view details