అన్నదాత గుండెల్లో ‘మీటర్లు’ పరిగెడుతున్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేస్తామంటూ అంగీకార పత్రాలు ఇవ్వకపోతే డిస్కంలు విద్యుత్తు సరఫరాను నిలిపేస్తున్నాయి. అంగీకార పత్రంతో పాటు 1-బి, ఆధార్ కార్డు ఇచ్చే దాకా పునరుద్ధరించటం లేదు. సరఫరాలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను సరి చేయాలన్నా మీటర్ల ఏర్పాటుకు అంగీకార పత్రాలు ఇచ్చారో లేదో... పరిశీలించాకే సిబ్బంది వస్తున్నారు. దీనివల్ల ఖరీఫ్ సాగుకు మోటార్లు పని చేయక ఇబ్బందులు పడుతున్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్ల ఏర్పాటుకు అంగీకరిస్తూ సంతకాలు చేయకపోతే... ప్రభుత్వ సబ్సిడీ రాదని, బిల్లులు మీరే చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్తు సిబ్బంది చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ సబ్సిడీ పథకాలూ ఆగిపోతాయని చెప్పి గ్రామ, వార్డు వాలంటీర్లు సంతకాలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లను ఏర్పాటు చేస్తోంది. మీటర్లు పెట్టినా రైతులపై పైసా భారం పడకుండా విద్యుత్తు రుసుములను ప్రతి నెలా ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది. ప్రభుత్వం భవిష్యత్తులో సబ్సిడీలను ఉపసంహరిస్తే రూ.వేలల్లో వచ్చే బిల్లుల భారాన్ని మోయక తప్పదన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. గ్యాస్ సబ్సిడీకి నగదు బదిలీ పథకాన్ని కేంద్రం అమలు చేసి.. ప్రస్తుతం సబ్సిడీని తగ్గించిన విషయాన్నే వారు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. రైతుల్లో నెలకొన్న సందేహాలను తీర్చకుండా సంతకాలు చేయించుకోవటం అపోహలకు దారితీస్తోంది. ప్రతి జిల్లాలో 30 శాతం మంది రైతులు అంగీకార పత్రాలు ఇవ్వటానికి జంకుతున్నారు.
రైతులకు తెలియకుండానే...
వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకాన్ని గత ఏడాది డిసెంబరు నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలోని 31,526 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేసింది. అంగీకార పత్రాలు తీసుకోకుండానే మీటర్లు ఏర్పాటు చేసినట్లు పలువురు రైతులు వాపోతున్నారు. మీటరు ఏర్పాటుపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. పొద్దునే పొలానికి వెళ్లేటప్పటికి మీటరు కనిపించిందని జలుమూరు మండలం రామదాసుపేటకు చెందిన రైతు కింజరాపు సత్యనారాయణ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అమలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు 17.55 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు ప్రక్రియను డిస్కంలు చేపట్టాయి. మీటర్ల ఏర్పాటుకు అంగీకరిస్తూ రైతు నుంచి విద్యుత్తుశాఖ సంతకాలను తీసుకుంటోంది. కొన్ని చోట్ల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా రైతుల హక్కు పత్రాలు, ఆధార్ కార్డులను సేకరిస్తోంది. ఇప్పటికే సుమారు 70-80 శాతం మంది రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంది. మీటర్ల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియను డిస్కంలు చేపట్టాయి.
అవగాహన లేకుండానే...
నగదు బదిలీ పథకంపై రైౖతుల్లో అవగాహన కల్పించటానికి సమావేశాలు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. కానీ, ప్రయోగాత్మకంగా మీటర్ల ఏర్పాటు చేపట్టిన శ్రీకాకుళం జిల్లాలోనే ఎలాంటి అవగాహన కార్యక్రమాల్నీ విద్యుత్తుశాఖ నిర్వహించలేదని రైతులు పేర్కొన్నారు. పథకాన్ని పర్యవేక్షించడానికి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఆ దాఖలాల్లేవు. పథకం అమలుపై రైతులకు ఉన్న సందేహాలకు లైన్‌మన్లు చెప్పే సమాధానాలు వారిలో భరోసా కల్పించటం లేదు. ప్రస్తుతం ప్రభుత్వమే విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నా.. భవిష్యత్తులో ఆ భారం తామే మోయక తప్పదన్న ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది.
*ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ను ఉచితంగా పొందుతున్న అందరికీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. పట్టాదారు పాసు పుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రాల ఆధారంగా కనెక్షన్ పేరును మారుస్తామని చెప్పారు. ఇవేమీ అందుబాటులో లేకున్నా గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ ఆధారంగా పేరు మార్చే అవకాశం ఉందని పేర్కొంది. కానీ, క్షేత్రస్థాయిలో హక్కు పత్రాలు లేని వారికి విద్యుత్ సరఫరాను సిబ్బంది నిలిపేస్తున్నారు.