గడచిన కొన్ని నెలల్లో అనేక మార్లు న్యాయస్థానాల నుంచి అక్షింతలు వేయించుకున్న పోలీస్‌శాఖ అమరావతి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లడం ద్వారా మరోసారి విమర్శల పాలైంది. ఈ నెల 23న 3 రాజధానాలకు మద్దతుగా ఆందోళన చేసేందుకు ఆటోల్లో వెళ్తున్న వారిని కృష్ణాయపాలెం వద్ద కొందరు దళిత రైతులు అడ్డుకున్నారు. దీనిపై వారు ఫిర్యాదు చేశారు.
అదే రోజు పోలీసులు 11 మందిపై ప్రాథమిక విచారణ జరపడం, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం, 24 గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవడం చకాచకా జరిగిపోయాయి. 24వ తేదీన ఏడుగుర్ని అరెస్టు చేసి నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు. అక్కడ కొవిడ్ పరీక్షలు చేసి గుంటూరు జిల్లా జైలుకు తీసుకొచ్చారు. వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్నవారితో కలిపి ఆర్టీసీ బస్సులో తరలించారు. ఆ సమయంలో ఇద్దరేసి రైతులకు కలిపి బేడీలు వేయడం దుమారం రేపింది. ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్థులకు వేసే బేడీలు అన్నంపెట్టే అన్నదాతలకు వేయడం మాజీ అధికారులను విస్మయపరుస్తోంది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని చెప్తున్నారు.