రాజధాని అంశంపై ప్రభుత్వం ఎన్ని వాయిదాలు వేసినా కదిలేది లేదని.. అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు. కమిటీల మాటను మరిచి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు, కూలీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహించారు. తుళ్లూరులో మోకాళ్లపై నించొని మహిళలు, రైతులు నిరసన తెలిపారు. నవులూరు, కృష్ణాయపాలెంలో రైతులు... నిరాహార దీక్ష చేశారు. పెనుమాక, ఎర్రబాలెంలో రహదారిపై బైఠాయించి... నిరసన తెలిపారు. సీపీఎం, కాంగ్రెస్ నేతలు వారికి సంఘీభావం తెలిపారు.
సర్కారు స్పష్టత ఇవ్వాలి
అమరావతిని రక్షించాలి... ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని నినాదంతో తాము చేస్తోన్న ఆందోళనలు ప్రభుత్వం నుంచి సుస్పష్టమైన నిర్ణయం వచ్చేంత వరకు కొనసాగుతాయని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రకటించారు. మూడు రాజధానుల ఆలోచన పూర్తిగా అర్ధరహితమైన చర్య అని.... ఇది విభజించి పాలించు నిర్ణయానికి ఊతమిస్తుందన్నారు. అమరావతి అంశం 29 గ్రామాల రైతుల సమస్య కాదని- మొత్తం రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన వ్యవహారమన్నారు.