రాజధాని రైతుల పోరు 26వరోజుకు చేరింది. ఆందోళన ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో రాజధాని గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఎవరూ బయటకు రావొద్దంటూ నిబంధనలను కఠినతరం చేశారు. అయితే మహిళలు, రైతులు మాత్రం తమ ఇళ్ల వద్ద, ఆలయాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేవాలయానికి వెళ్లే వారిని కూడా పోలీసులు అడ్డుకుంటుండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండటంతో పోలీసుల నిర్బంధంపై వారి ముందు ఆధారాలు పెట్టాలని మహిళలు నిర్ణయించారు.
రైతుల్ని అరెస్ట్ చేసేందుకు పలుచోట్ల పోలీసులు ఇళ్లలోకి చొరబడటం ఉద్రిక్తతకు దారితీసింది. రహదారి దిగ్బంధం కేసులో ఉన్నారంటూ వెలగపూడిలోని ఓ ఇంట్లోకి పోలీసులు చొరబడ్డారు. ఇంటి తలుపులు పగలకొట్టే ప్రయత్నం చేశారు. మహిళలు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెనుతిరిగారు.