Farmers problems: భారీవర్షాలు, వరదలతో రైతులు మూడేళ్లుగా నిలువునా మునిగారు. ఒక నెల వానలు ముఖం చాటేస్తే.. మరో నెలలో విరుచుకుపడుతున్నాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో ముంచేస్తున్నాయి. వాతావరణ మార్పులతో రైతులకు జరిగే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటోంది. పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధరలు దక్కక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏ పంట వేసినా పెట్టుబడి కూడా దక్కట్లేదు.
నివర్ తుపాను రైతుల తలరాతల్నే మార్చేసింది. ఎకరా వరికి రూ.40వేలు పెట్టుబడి పెడితే.. బాగా పండితే తొలి పంటలో కౌలు చెల్లించడమే గగనమవుతోంది. వర్షాలు వస్తే.. అదీ ఉండదు. పత్తి, వేరుసెనగ దిగుబడులు రాకపోగా.. పశుగ్రాసానికీ మిగలట్లేదు. మిరపరైతులు గతేడాది ఎకరాకు రూ.లక్ష వరకు నష్టపోయారు. కందికీ తెగుళ్లే. గతేడాది పొగాకు మినహా.. రైతుకు అచ్చి వచ్చిన పంటలు పెద్దగా లేవు. పీఎం కిసాన్, రైతు భరోసా, పెట్టుబడి రాయితీ, పంటలబీమా వారికి ఆర్థిక భరోసా ఇవ్వలేకపోతున్నాయి.
అదనులో ముఖం చాటేస్తున్న వానలు..అదునులో వర్షాల్లేక దిగుబడి అంతంతమాత్రంగా ఉంటోంది. పంట చేతికొచ్చే సమయంలో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వర్షం అవసరమైన ఆగస్టులో 36% తక్కువగా వానలు పడ్డాయి. పంట చేతికొచ్చే సెప్టెంబరులో 141% అధికంగా కురిశాయి. చిత్తూరు జిల్లాలో 2020 జూన్‌లో సాధారణ వర్షపాతం కురవగా.. జులైలో 167% అధికంగా నమోదైంది. ఆగస్టులో ముఖం చాటేయడంతో వేరుసెనగ దిగుబడి తగ్గింది. పంట చేతికొచ్చే దశలో సెప్టెంబరులో ముంచేసింది.
- పత్తి అధికంగా సాగయ్యే కర్నూలులో గతేడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో లోటు వానలే. పత్తి చేతికొచ్చే నవంబరులో సాధారణం కంటే 240% అధికంగా వానలు కురిశాయి.
సాధారణం కంటే 482% అధికంగా వానలు..2021 నవంబరులో రాయలసీమ, గోదావరి జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 482% అధికంగా వానలు కురిశాయి. కడప జిల్లాలోనూ 320%, కర్నూలులో 241, చిత్తూరులో 174% అధిక వర్షపాతం నమోదైంది. 2020 జులైలో కర్నూలులో 103%, అనంతపురంలో 147% అధికంగా నమోదయ్యాయి. సెప్టెంబరులో కడపలో 171%, అనంతపురంలో 100%, కర్నూలు జిల్లాలో 113% చొప్పున అధికంగా వానలు కురిశాయి.
అకాల వర్షాలతో మునిగి..గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కుంచవరానికి చెందిన తోట శ్రీనివాసరావు(34) దుగ్గిరాల మండలం ఈమనిలో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, జొన్న, మొక్కజొన్న వేశారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి రాక.. జొన్న, మొక్కజొన్నలకు ధర సరిగా లేక కౌలు కూడా చెల్లించలేకపోయారు. రూ.8 లక్షల అప్పులయ్యాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి.. దిక్కుతోచక 2021 మార్చి 13న పురుగుమందు తాగి చనిపోయారు.
ఈ కుటుంబానికి పరిహారం అందలేదు. ‘ఏడేళ్ల బాబు, అయిదేళ్ల పాపతో మా పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. బీమా సొమ్ముతోపాటు వాహనం అమ్మగా వచ్చిన రూ.38వేలు అప్పులకే ఇచ్చాం. ఇంకా రూ.7.40 లక్షలు అప్పు ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు’ అని అంజలీదేవి వాపోయారు.
గిట్టుబాటు ధర దక్కక..కూలి పనులు చేస్తూనే.. అయిదెకరాలు కౌలుకు తీసుకుని వేరుసెనగ, వరి సాగు ప్రారంభించిన వైయస్‌ఆర్ జిల్లా కమలాపురం మండలం వై.కొత్తపల్లె ఎస్సీ కాలనీకి చెందిన రవిశేఖర్‌కు గిట్టుబాటు ధర దక్కలేదు.