ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Farmers Cricket: పంటపొలాన్నే కాదు.. మైదానాన్నీ దున్నేస్తారు.! - Farmers played Cricket in bodh

Farmers Cricket: ట్రాక్టర్​తో పొలమంతా దున్నడమే కాదు.. మైదానంలో బంతిని పరుగులు పెట్టించడమూ తెలుసు. ఏ పంటను ఎలా సాగుచేయాలో తెలియడమే కాదు.. ఏ బంతిని ఎలా కొడితే బౌండరీలు దాటించవచ్చో కూడా తెలుసు. పంటకు తెగులు వచ్చినప్పుడు ఏ మందు వేయాలన్న సంగతే కాదు.. వికెట్​ పడగొట్టాలని ప్రత్యర్థి జట్టు ప్రయత్నించినప్పుడు పరుగులుగా మార్చడమూ తెలుసు. ఇదేంటి మైదానం, పంట అంటున్నారు అనుకుంటున్నారా.. ఈ ఉపోద్ఘాతం అంతా దేని గురించి అనే కదా మీ సందేహం. అయితే ఈ స్టోరీ చదివేయండి.

Farmers Cricket: పంటపొలాన్నే కాదు.. మైదానాన్నీ దున్నేస్తారు.!
Farmers Cricket: పంటపొలాన్నే కాదు.. మైదానాన్నీ దున్నేస్తారు.!

By

Published : Jan 10, 2022, 6:47 PM IST

Farmers Cricket: పంటపొలాన్నే కాదు.. మైదానాన్నీ దున్నేస్తారు.!

Farmers Cricket: నేల తల్లిని సాగు చేసి బంగారం లాంటి పంటలు పండించడమే కాదు.. క్రికెట్​ మైదానంలో బ్యాట్​ ఝుళిపించడమూ, బంతిని పరుగులు పెట్టించడమూ మాకొచ్చు అని నిరూపించారు ఐదు పదుల వయసులో ఉన్న ఈ రైతన్నలు. పదిమందికి అన్నం పెట్టే అన్నదాతలు.. సరదాగా గ్రౌండ్​లోకి దిగి స్థానికుల దృష్టిని ఆకర్షించారు. ఆటలో ఏ మాత్రం అనుభవం లేకున్నా.. తమదైన శైలిలో ఆడి మెప్పించారు. ఈ వయసులోనూ యువతతో పోటీ పడి శెభాష్​ అనిపించారు తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లా బోథ్​ మండలం రైతన్నలు. ఎప్పుడూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే కర్షకులు.. సరదాగా బ్యాట్​ పట్టి ఆడినంత సేపూ ఓ ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కల్పించారు.

పంచెకట్టుతోనే

సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక లాల్‌పిచ్‌ మైదానంలో క్రికెట్‌ పోటీలు జరుగుతుండగా.. పక్కనే పంట చేలలో పనులకు వచ్చిన రైతులు ఆటను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు మీరూ ఓ ఆట ఆడతారా? అని సరదాగా రైతులను అడిగారు. అంతే పంచెకట్టుతోనే మైదానంలోకి అడుగుపెట్టారు.

ఓడినా.. గెలిచారు

తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రత్యర్థి జట్టు 8 వికెట్లకు 59 పరుగులు చేయగా.. ఆ తర్వాత అన్నదాతల జట్టు 54 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితేనేమి వారి ఆట తీరుకు అక్కడున్నవారు ఆకర్షితులయ్యారు. వారి అంకితభావం, పట్టుదల చూసి స్ఫూర్తి పొందారు. ఆట జరుగుతున్నంత సేపూ.. రైతులు మైదానంలో చురుగ్గా ఉంటూ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రత్యేకతను చూపి అందరి మనసులను గెలిచారు.

ఇదీ చదవండి:సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ గుర్తుందా..?: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details