తెలంగాణ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద సాధారణంగా 14 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఎగువ మానేరు వరకు నాలుగున్నర లక్షలు, దిగువ మానేరు కింద మరో నాలుగున్నర లక్షల ఆయకట్టు ఉండేది. వీటికి కాకతీయ కాల్వ ద్వారా నీళ్లు అందించేవారు. లక్ష్మీ కాలువ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గానికి, సరస్వతీ కాలువ ద్వారా ప్రస్తుత నిర్మల్ జిల్లాకు నీళ్లు అందిస్తున్నారు. గతంలో ప్రాజెక్టు పూర్తిగా నిండక ఆయకట్టుకు నీళ్లందేవి కావు. ఎస్సారెస్పీ కింద నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వరకు ఆయకట్టు ఉంది. అయితే కాళేశ్వరం నిర్మాణంతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్వరూపం మారింది. కాళేశ్వరం నీటితో లోయర్, అప్పర్ మానేరు, మిడ్ మానేరును నింపుతున్నారు. దీంతో ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకున్నా కాళేశ్వరం కింద ఎత్తిపోస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద దిగువ మానేరు వరకే సాగు నీరు అందిస్తే సరిపోతుంది. దిగువ మానేరు వరకు దాదాపు 4.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
నిజాంసాగర్ ఆయకట్టుకు నీళ్లు...
ఇక తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో మాత్రం లక్ష్మీ కాలువతోపాటు, ఇతర ఎత్తిపోతల పథకాలు, శ్రీరాంసాగర్ కింద స్థిరీకరించిన నిజాంసాగర్ ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నారు. శ్రీరాంసాగర్ కింద నిజామాబాద్ జిల్లాలో కాకతీయ కాల్వ ద్వారా 9 వేలు, లక్ష్మీ కాలువ ద్వారా 25 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. ఇందుకు 4 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయి. చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల కింద చెరువుల ద్వారా మరో 8 వేల ఎకరాలకు ఎస్సారెస్పీ కింద నీళ్లు అందిస్తున్నారు. దీనికి 0.80 టీఎంసీల నీళ్లు అవసరం కానున్నాయి. ఇవి కాకుండా నిజాంసాగర్ ఆయకట్టును దాదాపు లక్ష ఎకరాల వరకు ఎస్సారెస్పీ కింద స్థిరీకరించారు. నిజాంసాగర్ లో నీటి లభ్యత లేనందున నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తున్నారు.