భూముల ఆన్లైన్ కోసం అన్నదాతల ఆందోళన వారసత్వంగా వచ్చిన తమ భూములు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంపై తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. రైతులు ధర్నా చేస్తుండగానే ఓ వ్యక్తి అత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, గ్రామస్థులు అతన్ని నిలువరించారు.
వరికోల్ పల్లి, కుమ్మరిపల్లి రైతుల ఆందోళన
జిల్లాలోని చిట్యాల మండలంలోని వరికోల్పల్లి, కుమ్మరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు.. తాము సాగు చేసుకుంటున్న భూములను బ్లాక్లిస్ట్ నుంచి తొలగించాలంటూ కలెక్టరేట్ ముందు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అదే సమయంలో సమ్మయ్య అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు వెంటనే బాటిల్ గుంజుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
నైపాక గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్లు 440,441,442,443లో తమకు భూములు ఉన్నాయని రైతులు తెలిపారు. గత 70 ఏళ్లగా 1600 ఎకరాలను 350 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని వెల్లడించారు. వారసత్వంగా వచ్చిన భూములకు గతంలో అధికారులు పట్టాలు జారీ చేశారని.. దీంతో రైతుబంధు డబ్బులు కూడా తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ తమ భూములు ఆన్లైన్లో కనిపించకపోవడం దారుణమని వాపోయారు. తమ గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
ఇదీ చూడండి: