సహకార సంస్థల ఆధునిక రూపంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) నిలుస్తున్నాయి. ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో అవి రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకు నేరుగా ఉత్పత్తులను విక్రయించడంపై తగిన సలహాలనందిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాల కొనుగోళ్లు, ఉత్పత్తుల విక్రయాల్లో రైతులు తరచూ దోపిడీకి గురవుతున్నారు. ఈ అడ్డంకులను అధిగమించేలా రైతుకు కావాల్సిన వ్యాపార, వాణిజ్య సహకారాన్ని ఎఫ్‌పీవోలు అందిస్తున్నాయి. దీంతో సమయం ఆదా కావడంతోపాటు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. రైతులు వాటాదారులుగా (షేర్‌హోల్డర్లు) నాబార్డు, ఉద్యానశాఖ, సెర్ప్, ఇతర శాఖల సహకారంతో ఎఫ్‌పీవోలు సేవలందిస్తున్నాయి. సింహభాగం సంఘాలను నిర్వహిస్తున్న నాబార్డు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కొన్నింటిని ఎన్జీవో(పీవోపీఐ)ల పర్యవేక్షణలో నడిపిస్తున్నాయి. తమ చేయూతతో మూడేళ్లనుంచి నిలదొక్కుకుంటున్న ఎఫ్‌పీవోలకు మరో రెండేళ్లపాటు నిధులు కేటాయించే వెసులుబాటును నాబార్డు కల్పిస్తోంది. ఒక్కో ఎఫ్‌పీవో వ్యాపారాభివృద్ధికి ఏటా రూ.5లక్షల వరకు ఇస్తారు. ఉద్యానశాఖ ద్వారానైతే రూ.3లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కేటాయించే వీలుంది.
మూలధనం, సంఘ కార్యకలాపాలు, సంఘాల ఎజెండా అమలు తీరునుబట్టి నిధుల కేటాయింపు ఉంటుంది. మూలధనం రూ.5-10 లక్షలుంటే బ్యాంకు రుణాలనూ పొందవచ్చు. 2027-28లోగా పదివేల కొత్త ఎఫ్‌పీవోల ఏర్పాటుకు కేంద్రం రూ.6,825 కోట్లు కూడా కేటాయించింది.
500 మందికి చేరిన సభ్యులు..
కర్నూలు జిల్లాలో 60 రైతు ఉత్పత్తిదారుల సంఘాలున్నాయి. నాబార్డు సహకారంతో రాంకీ ఫౌండేషన్ ఎన్‌జీవో పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సంగమేశ్వర సంఘం పాలు, వెన్న ప్యాకింగ్ చేస్తూ రెండేళ్ల కిందట రూ.2 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇదే జిల్లాలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో వై.కానాపురం రైతు ఉత్పత్తిదారుల సంఘం 10మందితో ప్రారంభమై 500మంది సభ్యులకు చేరింది. కోడుమూరు పరిధిలో పండించే కూరగాయలను రైతులనుంచి వారు సేకరించి శ్రీశైలం దేవస్థానానికి పంపుతున్నారు. ఈ ఏడాది వారు రూ.50 లక్షల టర్నోవర్ సాధించారు. పండ్లు, కూరగాయలు, పూలనిల్వ కోసం రూ.14 లక్షలతో సోలార్ శీతలగిడ్డంగిని ఏర్పాటు చేసుకున్నారు.
50వేల మందితో ఉత్పాదక సంస్థలు..
2016లో నెల్లూరు జిల్లా కోవూరు పొదుపులక్ష్మి మ్యాక్స్ ఆర్గనైజేషన్ పేరుతో లేగుంటపాడులో ఎఫ్‌పీవో ప్రారంభమైంది. వందమంది సభ్యులు ఉన్న సంఘం ఇప్పుడు వెయ్యికి చేరి, రూ.కోటి టర్నోవర్ సాధించింది. పూలు, ఉద్యాన పంటలు నేరుగా కొనేలా సంఘం కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. జలదంకి, కావలి ప్రాంతాల్లో జాతీయ రహదారిపై రైతు స్టాళ్లను ఏర్పాటు చేశారు.