Family Suicide: అప్పుల బాధ తాళలేక.. విజయవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య
తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేశ్ కుటుంబం అప్పుల బాధ భరించలేక విజయవాడలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. వారికి ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. నాలుగన్నర కోట్ల అప్పులు ఉన్నట్లుగా సమాచారం. నిజామాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న పప్పుల సురేశ్.. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం అపార్ట్మెంట్ వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారంతా తమతో కలివిడిగానే ఉండేవారని.. కానీ వాళ్లకు ఇన్ని అప్పులున్నాయని తెలియదని చెబుతున్నారు.
ఎనిమిదేళ్లుగా పప్పుల సురేశ్ కుటుంబం ఇదే అపార్ట్మెంట్లో ఉంటోంది. వారిని చూస్తే ఉన్నత స్థితిలో ఉన్నట్లుగానే అనిపిస్తారు. స్థానికంగా బస్టాండ్ ఎదురుగా సురేశ్‌కు మెడికల్ షాప్ ఉంది. ఇటీవల రోడ్డు వెడల్పులో ఆ షాప్ కూలగొట్టారు. దానికి సంబంధించి అప్పులు ఉండొచ్చు. రెండు రోజుల క్రితం ఓ సంస్థ వాళ్లు ఈ ఇంటిని సీజ్ చేశారు. ఇటీవల చాలా మంది బాకీల వసూళ్ల కోసం ఇంటికి వచ్చారు. అప్పుడే వాళ్లకు ఇన్ని అప్పులున్నాయని మాకు తెలిసింది. బయటకు వెళ్లి వెంటనే వస్తారనుకున్నాం కానీ.. ఇలా సూసైడ్ చేసుకుంటారని అనుకోలేదు. -- స్థానికులు, నిజామాబాద్