మూడేళ్లలో ఒక్క పోస్టూ నింపలే!.. ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ విద్యాసంస్థలు VERSITY : రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. వర్శిటీల్లో వందల సంఖ్యలో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జగన్ సీఎం అయిన మొదట్లో ఏయూలో జరిగిన సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. రాష్ట్రానికి గర్వకారణమైన ఏయూలో 459 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన ఆ స్థాయిలో వ్యాఖ్యానించేసరికి వర్శిటీల తలరాత మారుతుందని అంతా భావించారు.
ప్రధాన వర్శిటీల్లోనై అధ్యాపకుల కొరత తీరుతుందని భావించారు. కానీ.. ఈ మూడేళ్లలో ఒక్క పోస్టూ నింపకపోవడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రాభవం కోల్పోతున్నాయి. 2వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినా ఇప్పటికీ రాలేదు. ఏయూలో 920 పోస్టులు ఉండగా, రెగ్యులర్ అధ్యాపకులు 190 మంది మాత్రమే ఉన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కలిపి 3,259 అధ్యాపక పోస్టులకు 60 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయి. ఒప్పంద అధ్యాపకులతోనే బోధన సాగిస్తున్నారు. ఇంజినీరింగ్ కోసమే ప్రత్యేకంగా నెలకొల్పిన అనంతపురం జేఎన్‌టీయూలో 146 పోస్టులకు 48 మందిని నియమించగా, 244మంది ఒప్పంద అధ్యాపకులున్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో 102 పోస్టుల్లో 41ఖాళీలు ఉన్నాయి. 233మంది ఒప్పంద అధ్యాపకులే.
పులివెందుల, కలికిరి, నరసరావుపేట కళాశాలలు, కొత్తగా ఉన్నతీకరించిన విజయనగరం గురజాడ జేఎన్‌టీయూలోనూ భారీగా ఖాళీలున్నాయి. విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పుడు మంజూరైన పోస్టులు మినహా.. తర్వాత కోర్సులు, బ్రాంచీలు విస్తరించినప్పటికీ ఆ మేరకు పోస్టులు ఇవ్వలేదు. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులతో ప్రారంభించిన ఆర్జీయూకేటీకి 717 పోస్టులు మంజూరుకాగా, 52 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులున్నారు. రానున్న రెండేళ్లల్లో తిరుపతి ఎస్వీయూలో సుమారు 60మంది, విశాఖ ఏయూలో 50మంది రిటైర్ కానున్నారు. మిగతా వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సాంకేతిక విద్యలో వస్తున్న కొత్త కోర్సులకు అనుగుణంగా విద్యాసంస్థల్లో మార్పులు చేయాలంటే అధ్యాపకుల కొరత అడ్డంకిగా మారుతోంది. కొన్నింటిని సెల్ఫ్ ఫైనాన్స్‌లోకి మార్చి, ఒప్పంద అధ్యాపకులను నియమిస్తున్నారు. న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపునకు అధ్యాపక పోస్టులే కీలకం. మౌలిక సదుపాయాలు కొరవడి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లోనూ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రభ మసకబారింది. గత నాలుగేళ్ల ర్యాంకులు చూస్తే కాకినాడ, అనంతపురంలోని జేఎన్‌టీయూల పరిస్థితి దిగజారింది.
ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాభవాన్ని కోల్పోతోంది. ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలదీ అదే పరిస్థితి. ఇవి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కావడంతో ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఇక్కడే చేరుతున్నారు. చేరిన తర్వాత సమస్యలు చూసి ఆందోళన చెందుతున్నారు. వసతిగృహాలు, వాటిల్లో సదుపాయాలు, భోజనాలపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలకు వసతిలోనూ అనేక ఇబ్బందులున్నాయి.
ఇవీ చదవండి: