యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనమైనప్పటికీ ఆ బంధాన్ని కొనసాగిస్తూ.. ఖాతాదారులు, ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని యూనియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ జి.రాజ్ కిరణ్‌రాయ్ అన్నారు. తమ కార్యకలాపాలకు తెలుగు రాష్ట్రాలు ఎంతో కీలకమని చెప్పారు.
భారతీయ బ్యాంకింగ్ రంగంపై కొవిడ్-19 ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది?
కరోనా మహమ్మారి విజృంభించకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల వ్యక్తులతోపాటు, వ్యాపారాలపైనా ప్రతికూల ప్రభావం పడింది. స్వల్పకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఇది బలహీనపర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో ఇది కనిపించే అవకాశం ఉంది. వినియోగదారుల నుంచి గిరాకీ లేకపోవడంతో చాలా వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. దీనివల్ల తొలి త్రైమాసికంలో బ్యాంకుల రుణ ఖాతాల వృద్ధిలో సవాళ్లు ఎదురవుతాయని అనుకోవచ్చు. దీంతో పాటు రుణ వాయిదాల వసూలులోనూ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉండేది. అదృష్టవశాత్తూ.. ఆర్‌బీఐ అన్ని వర్గాల రుణ గ్రహీతలకూ కొన్ని మినహాయింపులు కల్పించింది. ఫలితంగా స్వల్పకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను తప్పించుకునేందుకు వీలయ్యింది. ముఖ్యంగా ఎన్‌పీఏలు పెరగకుండా కాపాడిందని చెప్పొచ్చు. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే.. వృద్ధి బాటలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భావిస్తున్నాం.
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రుణాలకు గిరాకీ పెరుగుతుందా? ఏయే రంగాల నుంచి ఇది ఉంటుందని భావిస్తున్నారు?
ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఉపద్రవం నెమ్మదించి.. వ్యక్తులు, వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత రుణాలకు గిరాకీ పూర్వ స్థాయిలోనే ఉంటుందని ఆశిస్తున్నాం. కరోనాతో రిటైల్, ఎంఎస్‌ఎంఈ రంగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో నగదు లభ్యత తగ్గడంతో పాటు సరఫరాలో ఇబ్బందులు, ఉద్యోగులు లేకపోవడం లాంటివి మరింత కష్టాలు సృష్టించాయి. కొవిడ్-19 తర్వాత వ్యవసాయం, గ్రామీణ రుణాలు, ఎంఎస్‌ఎంఈలు, వ్యక్తిగత రుణాల విభాగంలోని రుణాలకు అధిక గిరాకీ ఉంటుందని అనుకుంటున్నాం.
ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మీ స్థానం ఎలా ఉంది? ఇక్కడ మరింత వృద్ధి చెందేందుకు ఎలాంటి ప్రణాళికలను అమలు చేస్తున్నారు?
విలీనం తరువాత తెలుగు రాష్ట్రాల్లో మేము పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా మారాం. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌కు ఏపీలో 1220, తెలంగాణలో 737 శాఖలు ఉన్నాయి. తెలంగాణ వరకూ అతిపెద్ద బ్యాంకుగానే మారాం. రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాలు మా వ్యాపారానికి ఎంతో కీలకంగా మారతాయి. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలతోపాటు, నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలకు ఇక్కడ ప్రాముఖ్యం పెరుగుతుంది. దీన్ని మేము అవకాశంగా మలుచుకుంటాం. ఎంఎస్‌ఎంఈ రుణాలు, వ్యవసాయ రుణాలు, బంగారంపై అప్పు తదితరాలకు గిరాకీ ఉంటుందని అనుకుంటున్నాం. రిటైల్, కార్పొరేట్ రుణాలపైనా దృష్టి సారిస్తున్నాం. దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రాబ్యాంకుతో విడదీయలేని అనుబంధం ఉంది. తెలుగు ప్రజలు ఆంధ్రాబ్యాంకుపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెడతాం.