రాష్ట్రంలోని కొవిడ్ ఆస్పత్రులన్నింట్లో కలిపి వెయ్యి మందికిపైగా రోగులు ఉన్నారు. వీరి ఆరోగ్య స్థితిని అనుసరించి నర్సులు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలోని రాష్ట్ర స్థాయి కొవిడ్ ఆస్పత్రిలో సుమారు 90 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి షిఫ్టునకు 30 నుంచి 35 మంది నర్సులు సేవలందిస్తున్నారు. ప్రతి రోగి రక్తపోటు, ఇతర ఆరోగ్య లక్షణాలను గంట, 2 గంటలకొకసారి పరీక్షిస్తున్నారు. ప్రత్యేక కవర్ల ద్వారా వచ్చిన భోజనం, అల్పహారాన్ని రోగులకు అందజేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో పడకలకే పరిమితమైన రోగుల విషయంలోనూ శ్రద్ధ చూపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం 2020ని నర్సుల సంవత్సరంగా ప్రకటించి వారి సేవలను ప్రశంసించింది.
అడుగు తడబడితే..
కొవిడ్ రోగులు ఉండే వార్డుల్లోకి వెళ్లేముందు ప్రత్యేక సూట్, చేతులకు తొడుగులు, ముఖానికి మాస్కులు ధరించాలి. వీటితో 6 నుంచి 8 గంటల వరకు అలాగే ఉండాలి. ఈ సమయంలో కాఫీ, టీ వంటివి తీసుకునేందుకూ వీల్లేదు. విధులు ముగిశాక సూట్‌ను తొలగించే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్న పొరపాటు దొర్లినా వైరస్ వెంటాడుతుంది.
టెన్షన్..టెన్షన్...
ఆఫీసులో ఓ రెండు గంటలు ఆలస్యమైతే ఇంట్లో వాళ్ల గురించి మనం ఎంత ఆలోచిస్తాం. మరి ఈ నర్సులు విధులు ముగిసిన వెంటనే ఇళ్లకు పోలేరు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటళ్లు, వసతిగృహాల్లో ఉంటున్నారు. వారం రోజులు పనిచేసిన తర్వాత వీరి నుంచి నమూనా (తెమడ-స్వాబ్) సేకరించి పరీక్షిస్తున్నారు. నెగిటివ్ వస్తే రెండు వారాల తర్వాత విధులకు హాజరవుతున్నారు. కుటుంబసభ్యులు వీరు ఉన్న చోటుకు వచ్చి దూరం నుంచే పరామర్శించి వెళ్లిపోతున్నారు.
నర్సులు ఏమన్నారంటే...