ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు

కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు కల్పించింది. ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వాలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ బోర్డులకు కల్పించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్​లో స్పష్టం చేసింది. కానీ దేశంలో ఏ బోర్డుకు ఈ అధికారం లేదు.

boardExtensive powers krishna and godavari board
board

By

Published : Jul 18, 2021, 4:19 AM IST

Updated : Jul 18, 2021, 7:55 AM IST

దేశంలోని ఏ నదీ యాజమాన్య బోర్డుకూ లేని విస్తృత అధికారాలను కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్రం కల్పించింది. ఏ బోర్డుకు తమ ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వాలపై చర్య తీసుకొనే అవకాశం లేదు. కానీ ఈ రెండు బోర్డులకు చర్యలు తీసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. తాజాగా కేంద్రం ప్రచురించిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను, దీనికి ఆధారంగా తీసుకొన్న ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి విడుదలలో సమస్యలు వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులు, నీటిని విడుదల చేసే తూములే కాకుండా మొత్తం బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులను కేంద్రం బోర్డుల పరిధిలోకి తెచ్చింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెన్నా బేసిన్‌కు.., గోదావరి ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్‌లోకి నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులున్నాయి. దీంతో కృష్ణా, పెన్నా బేసిన్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చింది. వీటన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలు 9వ పేరా ప్రకారం ఏ రాష్ట్రమైనా నిర్ణయాన్ని అమలు చేయకపోతే దీనికి సంబంధిత రాష్ట్రం బాధ్యత వహించడంతో పాటు కేంద్రం వేసే ఎలాంటి అపరాధాన్నయినా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధన ఏ బోర్డులోనూ లేదు. వివిధ రకాల నీటి లభ్యత కింద కేటాయింపులు ఉన్నందున తీర్పును ఒక రాష్ట్రం అమలు చేయకపోయినా ఇంకో రాష్ట్రంపై ఆ ప్రభావం పడుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకొని కృష్ణా జల తీర్పు అమలు బోర్డును ఏర్పాటు చేయాలని కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-2 పేర్కొంది. దీనికి పర్యవేక్షణ అధికారం మాత్రమే ఉంది. పరిధి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు మరిన్ని విస్తృతాధికారాలతో కొత్త బోర్డును కేంద్రం నోటిఫై చేసింది. కృష్ణా ట్రైబ్యునల్‌-2 తుది తీర్పు 2013లోనే వచ్చినా సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇంకా కేంద్రం నోటిఫై చేయలేదు. తుంగభద్ర బోర్డుకు పూర్తి అధికారాలున్నాయి. ఇదిఒక ప్రాజెక్టు కింద రెండు రాష్ట్రాల వినియోగం, ఎగువన అనధికార వినియోగంతో ఏపీకి రావాల్సిన నీరు రాకున్నా పోలీసుల సాయంతో వచ్చేలా ప్రయత్నం చేయడం తప్ప వేరే రకమైన చర్య తీసుకోవడానికి వీల్లేదు. పైగా అక్కడ కాలువల ద్వారా వచ్చే నీటిని అనధికారికంగా వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కావేరిలో నీటి యాజమాన్య అథారిటీ తీసుకొనే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకున్నా.. సహకరించకపోయినా కేంద్రం సాయం కోరవచ్చు. భాక్రా-బియాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తరహాలో కావేరి బోర్డు ఏర్పాటైంది.

మెజారిటీ ఇంజినీర్లు బోర్డు పరిధిలోకి

రెండు రాష్ట్రాల పరిధిలో ప్రత్యేకించి కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఇంజినీర్లలో ఎక్కువ మంది ఇక నుంచి బోర్డు పరిధిలోకి రానున్నారు. బోర్డు కనుసన్నల్లోనే పనులు జరుగుతాయి. ఈక్రమంలో కొందరు చీఫ్‌ ఇంజినీర్ల పాత్ర నామమాత్రం కానుంది. అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చినా, బోర్డు నియంత్రణలో కొన్ని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించేవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీ నీటిపారుదల శాఖకు సంబంధించి 250 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా బోర్డు పరిధిలోకే వస్తారు. శ్రీశైలం అనుబంధంగానే రెండు విద్యుత్తు హౌస్‌లు, హంద్రీనీవా, కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు, బనకచెర్ల హెడ్‌రెగ్యులేటర్‌, వెలిగొండ, సాగర్‌ ప్రాజెక్టు, దీనికి అనుబంధంగా ఉన్న కాలువలు, పవర్‌ హౌస్‌ ఇలా అన్నీ బోర్డు పరిధిలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లోని ఉద్యోగుల అంశాలను కూడా బోర్డే చూస్తుంది.

ఇదీ చదవండి:AP NOMINATED POSTS 2021: నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..

Last Updated : Jul 18, 2021, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details