కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలమవుతోంది. కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను సమర్థంగా కట్టడి చేసే ఏకైక మార్గం.. టీకా! ఇది ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి లేక వచ్చే ఏడాది ఆరంభంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని వివిధ దేశాల్లోని ప్రయోగాలు సూచిస్తున్నాయి.
అయితే భారత్ చేపట్టిన వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను ఈ ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా క్లినికల్ పరీక్షలను వేగంగా నిర్వహించటానికి సహకరించాలంటూ సంబంధిత ఆస్పత్రులకు ఐసీఎంఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. త్వరగా టీకా తీసుకురావాలనే ఆలోచన మంచిదే అయినా అది ఏ మేరకు సాధ్యమనే సందేహం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
ఐసీఎంఆర్- భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ (కొవాగ్జిన్), మనుషులపై ప్రయోగాల స్థాయికి (మొదటి, రెండో దశ) చేరింది. ఈ పరీక్షలను సత్వరం పూర్తిచేసి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దశల పరీక్షలను 1,125 మంది ‘వాలంటీర్ల’పై నిర్వహించాల్సి ఉందని తెలిసింది. మనుషులపై ప్రయోగాల నిర్వహణ చాలా కష్టమైన ప్రక్రియ. దీనికి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లోని నైతిక విలువల కమిటీలు అనుమతి ఇవ్వాలి. ఇప్పటివరకూ అయిదు ఆస్పత్రుల కమిటీలే క్లినికల్ పరీక్షలకు అనుమతి ఇచ్చాయి. మిగిలిన ఏడు ఆస్పత్రుల్లో అనుమతి తీసుకోవటం, వాలంటీర్లను గుర్తించటం, వారిపై ప్రయోగాలు చేసి ఫలితాలను విశ్లేషించటానికి చాలా సమయం కావాలి. ఎక్కడ ఆలస్యం జరిగినా, అనుకున్న ఫలితాలు రాకపోయినా వ్యాక్సిన్‌ను నిర్ణీత సమయానికి తీసుకురాలేని పరిస్థితి ఎదురవుతుంది.
ప్రయోగాలు ఎలా?
మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాల నిర్వహణకు ముందుగా ఆరోగ్యవంతులైన వ్యక్తులను ఎంపిక చేయాలి. వారికి కొవిడ్ పరీక్షతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేసి సంబంధిత వివరాలన్నింటీనీ దిల్లీలోని ప్రయోగశాలకు పంపాలి. అక్కడ నుంచి ఆ సమాచారాన్ని ఐసీఎంఆర్ క్రోడీకరిస్తుంది. అందులో అర్హులైన వారిపై ప్రయోగాలకు పచ్చజెండా ఊపుతుంది.
- మొదటి దశ ప్రయోగాలను 375 మందిపై నిర్వహిస్తారని తెలిసింది. వాలంటీర్లకు ఈ దశలో మొదట ఒక డోసు టీకా ఇచ్చి రెండు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచి 13 రోజుల వరకూ వారి ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేస్తారు. 14వ రోజున మరికొన్ని పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత అదే వ్యక్తికి రెండో డోసు ఇస్తారు. ఆ తర్వాత 11 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. ఇలా వాలంటీర్ల నమూనాలను విశ్లేషించి ఐసీఎంఆర్‌కు అందించాలి. ఆ ఫలితాలను బట్టి టీకాకు తుది అనుమతి ఇవ్వాలా లేక రెండోదశ.. ఆ తర్వాత మూడోదశ పరీక్షలు నిర్వహించాలా అనేదాన్ని ఐసీఎంఆర్ నిర్ధరిస్తుంది.
- సాధారణంగా మొదటి దశ పరీక్షల్లో ఎంత డోసుతో ఫలితం ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తారు. రెండో దశ పరీక్షల్లో అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదా నిర్ధరించుకోవాలి. మూడో దశ పరీక్షల్లో అన్ని రకాలైన వారిపై టీకాను ప్రయోగించి చూస్తారు.