ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టకుండానే శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. మరిప్పుడు ఏం జరగబోతోంది..? జులై 1న ఉద్యోగులకు జీత భత్యాలు, బిల్లులు చెల్లించడం సాధ్యమేనా? ఇలాంటి సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు శాసనసభ ఆమోదం పొంది, మండలికి చేరింది కాబట్టి.. అక్కడ ప్రవేశపెట్టకపోయినా ఇబ్బందేమీ లేదని శాసనసభా వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక బిల్లు ఏదైనా మండలికి వచ్చిన రోజు నుంచి 14 రోజుల్లోగా అక్కడ ఆమోదం పొందినా, పొందకపోయినా.. ఆమోదించినట్టుగానే పరిగణించి, గవర్నర్‌కు పంపుతారని వివరించారు.
పార్లమెంటులోనైనా, రాష్ట్ర శాసన వ్యవస్థలోనైనా ద్రవ్య వినిమయ బిల్లుకు దిగువసభలో ఆమోదమే కీలకం. తర్వాత ఎగువ సభకు దాన్ని ఆపే హక్కు ఉండదు. పార్లమెంటు నిబంధనల ప్రకారం... ఏదైనా ద్రవ్యబిల్లును లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభకు పంపినప్పుడు 14 రోజుల్లోగా సిఫారసులతో గానీ, యథాతథంగా గానీ ఆ బిల్లును ఆమోదించి పంపాలి. రాజ్యసభ చేసిన సిఫారసుల్లో కొన్నింటిని గానీ, అన్నింటినీ గానీ లోక్‌సభ ఆమోదించవచ్చు. అన్నిటినీ పక్కనా పెట్టొచ్చు. బిల్లు రాజ్యసభకు వచ్చాక 14 రోజుల్లోగా దాన్ని తిప్పి పంపకపోతే.. ఆమోదం పొందినట్టే పరిగణిస్తారు. దాదాపుగా ఇవే నిబంధనలు రాష్ట్రాలకూ వర్తిస్తాయి.
జీతాలకు ఇబ్బందా?
కరోనా వల్ల మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే వీల్లేక.. ప్రభుత్వం మూడు నెలలకు ఓటాన్ అకౌంట్‌కి ఆర్డ్‌నెన్స్ తెచ్చింది. దాని గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అంటే నెలాఖరులోగా ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందాలి. బుధవారం నుంచి ఈ నెలాఖరుకు 14 రోజుల గడువుంది. బిల్లు బుధవారం మండలికి వచ్చింది కాబట్టి.. ఆమోదం పొందినట్టవుతుంది. దాన్ని గవర్నర్‌కి పంపి ఆమోదం పొంది ఉద్యోగులకు జీతాలివ్వాలి. అందువల్ల ఈసారి జీతాలు ఒకటి, రెండు రోజులు ఆలస్యం కావచ్చు. జాప్యం లేకుండా ఈ నెలాఖరునే చెల్లించానుకుంటే.. మళ్లీ ఆర్డ్‌నెన్స్ తేవాలి. దానికి అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలి. లేదా గవర్నర్ అనుమతితో మళ్లీ మండలిని సమావేశపరిచి.. ద్రవ్య వినిమయ బిల్లుకు అక్కడ ఆమోదం పొందాలి.