ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

pulichintala dam: ఆనాడే డ్యాం నిర్మాణంపై నిపుణుల అసంతృప్తి - పులిచింతల డ్యామ్ నాణ్యత గురించి

పులిచింతల ప్రాజెక్టు డ్యాం నిర్మాణంపై గతంలోనే నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేదని, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని నిపుణులు ఆనాడే హెచ్చరించారు. డ్యాం భద్రతపై 2015లోనే అనేక అంశాలు వెలుగులోకి తెచ్చింది 'ఈనాడు'. రెండు ఏళ్లుగా పూర్తి స్థాయిలో నీటిని నిల్వచేసినా.. మూడో ఏడాది పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరింది. ఇంతలో గేటు కొట్టుకుపోయింది.

pulichintala dam poor quality
pulichintala dam poor quality

By

Published : Aug 6, 2021, 7:09 AM IST

పులిచింతల ప్రాజెక్టు నాణ్యత, భద్రత ముందునుంచి ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. రెండేళ్లుగా పూర్తి స్థాయిలో నీటిని నిల్వచేసి హమ్మయ్య అనుకుంటున్నారు. మూడో ఏడాదీ పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరింది. ఇంతలో ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. అనుకున్నంతా అయిందని జల వనరులశాఖ నిపుణులే పెదవి విరుస్తున్నారు. ఎంతో విలువైన లక్షల క్యూసెక్కుల నీటిని వృథాగా కిందకు వదిలేయాల్సి వస్తోంది.

డ్యాం భద్రతపై 2015 ఫిబ్రవరిలోనే ‘ఈనాడు’ అనేక అంశాలను వెలుగులోకి తెచ్చి, వరుస కథనాలు ప్రచురించింది. ప్రాజెక్టును జాతికి అంకితం చేసినప్పటి నుంచి డ్యాంలో నీరు నిల్వచేసే విషయంలో జల వనరులశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేదని, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని నిపుణులు గతంలోనే హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు. 2015 వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటి నిల్వ 20 టీఎంసీలకు పెంచగలమా లేదా అన్న విషయమై డ్యాం భధ్రతా కమిటీ పరిశీలన చేపట్టింది. 2015 జనవరి మొదటివారంలో ఈ కమిటీ పులిచింతలను సందర్శించింది.

‘డ్యాం నిర్మాణంలో భద్రతాపరంగా అనేక లోపాలున్నందువల్ల నీటి నిల్వను దశలవారీగా పెంచుకుంటూ వెళ్లాలి. అవసరమైన అన్ని సివిల్‌, మెకానికల్‌ పనులు పూర్తి చేయాలి. గుర్తించిన లోపాలన్నీ సవరించాలి. మరోసారి పరిశీలించి, ఆ తర్వాతే నీటి నిల్వను పెంచుకోవడం ఉత్తమం’ అని డ్యాం భద్రతా కమిటీ నాడు సూచించింది. ఆ రోజు పులిచింతల సందర్శనకు వెళ్లి వచ్చిన ఒక నిపుణుడు మాట్లాడుతూ ‘నేను ఎన్నో ప్రాజెక్టులు చూశాను. ఇంత దారుణమైన పనితీరు ఎక్కడా లేదు. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం సాధ్యమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని విశ్లేషించారు. ఇప్పుడు పులిచింతలలో గేటు కొట్టుకుపోవడంతో నాటి నిపుణుల అనుమానాలు నిజమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పట్లోనే షట్టర్ల పనులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రధానంగా గేట్లు, వాటిని ఎత్తేందుకు అవసరమైన ఏర్పాట్లు, పియర్‌ నిర్మాణాలు, ఇందుకు సంబంధించిన కాంక్రీటు, మెకానికల్‌ పనులు సవ్యంగా లేవని నాడే తేల్చారు.

పియర్ల నిర్మాణంలో లోపాలు...

పులిచింతల ప్రాజెక్టులో 24 గేట్లు నిర్మించారు. కృష్ణాలో మిగులు జలాలు ఉన్నప్పుడు పులిచింతల ద్వారా 1500 టీఎంసీలు ప్రవహిస్తుందని జలవనరులశాఖ నిపుణులు చెప్పారు. సాధారణంగా గేట్ల భారమంతా పియర్లపై ఉంటుంది. నాడు భద్రతా కమిటీ కొన్ని పియర్ల నిర్మాణ తీరును పరిశీలించింది. ఆకృతుల ప్రకారం పియర్‌ వెడల్పు 4.80 మీటర్లు ఉండాలి. కానీ ఒకటి, రెండు పియర్లు 3.80 మీటర్లే ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అప్పట్లో నిపుణులు గుర్తించిన పియర్‌కు, ఇప్పుడు గేటు ఊడిన పియర్‌కు సంబంధం లేదని ఇప్పటి అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై నాడు తనిఖీకి వెళ్లిన ఒక నిపుణుడితో మాట్లాడగా.. పియర్ల నిర్మాణంలో అనేక లోపాలున్నాయని, గేట్ల ఏర్పాటు సమయంలో అనేక సర్దుబాట్లు చేసుకుని వాటిని ఏర్పాటు చేయవలసి వచ్చిందని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details