రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యమంటూ... జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ 3 రాజధానుల ఏర్పాటుకు సిఫారసు చేసింది. అమరావతిలో చట్టసభలు, విశాఖలో పాలన, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్‌లో సచివాలయంతోపాటు సీఎం క్యాంపు కార్యాలయం, అసెంబ్లీ వేసవికాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పింది. విశాఖతో పాటు అమరావతిలో హైకోర్టు బెంచ్‌లు నెలకొల్పాలని నివేదికలో పేర్కొంది.
అసెంబ్లీ, మంత్రుల నివాసాలు, గవర్నర్ నివాసం ఉండే రాజ్‌భవన్ అమరావతిలో ఉండాలని నివేదించింది. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టుతో పాటు అనుబంధ కోర్టులు ఏర్పాటుకు సిఫారసు చేసినట్లు తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణ అంశాలనూ నివేదికలో పొందుపరిచినట్లు కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సవివర నివేదిక అందించింది.
అమరావతి ప్రాంతంలో వరద ముంపు సమస్య ఉందని... అందువల్ల పూర్తిస్థాయి రాజధాని వద్దని సూచించామని కమిటీకి నేతృత్వం వహించిన జీఎన్ రావు వెల్లడించారు. అమరావతిలో ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను పూర్తిచేసి వాడుకోవాలని చెప్పినట్లు వివరించారు. నాగార్జున వర్సిటీ, ఏపీఎస్పీ బెటాలియన్ భూములు ఉన్నచోట శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టవచ్చన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరకోస్తా, రాయలసీమ అభివృద్ధికి సూచనలు చేశామని, ఆ దిశలోనే రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ ఉండాలని తెలియజేశామన్నారు.