గురువారం రాష్ట్ర హైకోర్టులో వివిధ వ్యాజ్యాల విచారణ సందర్భంగా.... జస్టిస్ రాకేశ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్న అంశం విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్ తప్పుకోవాలంటూ ప్రభుత్వం అనుబంధ వ్యాజ్యం దాఖలు చేసిందని..... న్యాయవాది సుమన్ ధర్మాసనానికి విన్నవించారు. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తారన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నంపై ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏను కొట్టివేస్తూ... ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులు తమకింకా అందలేదన్నారు. తక్షణమే వాటిని అందించాలని రిజిస్ట్రీని ఆదేశించినట్టు ధర్మాసనం గుర్తుచేసింది.
జోక్యం చేసుకున్న న్యాయవాది మోహన్‌రెడ్డి.... దస్త్రాలు రిజిస్ట్రీకి పంపకుండా ఛాంబర్‌లో ఉంచినంత కాలం వాటిని పొందలేమన్నారు. సివిల్ దావాల్లో అప్పీల్‌కు వెళ్లకుండా చేయాలనుకున్నప్పుడు కొంతమంది న్యాయాధికారులు.... దస్త్రాలను ఛాంబర్‌లో ఉంచుతారన్న వాదనలపై కోర్టు అభ్యంతరం తెలిపింది. అప్పీల్‌కు వెళ్లడం మీ హక్కు అని గుర్తు చేస్తూ అప్పటికప్పుడు రిజిస్ట్రీని పిలిచి... ఉత్తర్వుల ప్రతిని ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేస్తుండగా పోలీసులు తరఫు న్యాయవాది ఎస్ఎస్ప్రసాద్ పలుమార్లు జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ రాకేశ్‌కుమార్... విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ వేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతామని పేర్కొంటూ శుక్రవారానికి వాయిదా వేసింది.