‘‘ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చి కుంభవృష్టి, వరదలు, అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు, కరవు వంటివి తరచూ ఏర్పడుతున్నాయి. వాతావరణంపై ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, అన్ని వ్యవస్థలు కలసి పనిచేస్తేనే నష్టాలు తగ్గించగలం. జులైలోనే తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు కురవడం అరుదు’’ అని వాతావరణ శాస్త్రవేత్త, రిటైర్డ్ డీడీజీ వైకే రెడ్డి చెప్పారు. భారత వాతావరణశాఖలో 34 ఏళ్లు జాతీయ స్థాయి డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ)గా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ అనంతరం ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం చేసిన ఆయనకు తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ఎంతో అవగాహన ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వాతావరణ కేంద్రాలిచ్చే సమాచారం, ఇక్కడి పరిస్థితులను పోలుస్తూ ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ముప్పు ముంచుకొస్తోంది..
By
Published : Jul 30, 2022, 4:24 PM IST
విదేశాలు.. భారత్‌లో క్లౌడ్ బరస్ట్ ద్వారా వానలు కురిపించే అవకాశం ఉందా?
విమానాలు, రాకెట్లతో రసాయన పొగను మేఘాలపై వదలడం ద్వారా ఓ మోస్తరు వర్షాలు కురిపించవచ్చు. అలా చేయాలంటే విదేశీ విమానాలు, రాకెట్లు మనదేశంలోకి అనుమతి లేకుండా రావాలి. అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థలున్న ఈ కాలంలో ఇలా చేయడం అసాధ్యమే.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి?
అమెరికాలో గాలుల ప్రవాహం ద్వారా వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. భారత్‌లో సమశీతోష్ణ వాతావరణం వల్ల అప్పటికప్పుడు అనూహ్య మార్పులు ఏర్పడి నిర్దేశిత ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ మార్పులపై ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ పోరాడకపోతే ఆస్తి, ప్రాణం నష్టం తీవ్రంగా ఉంటుంది. మున్ముందు యుద్ధాల కన్నా వాతావరణ మార్పుల వల్లనే ఎక్కువ నష్టాలు వాటిల్లుతాయి.
అమెరికాకు, మనదేశానికి వాతావరణ అంచనాల్లో ఎలాంటి తేడాలున్నాయి?
అమెరికాలో వాతావరణ సమాచారం ఇచ్చే మొబైల్ యాప్‌లు ఎక్కువ. వాటిలో ప్రతీ 3 గంటలకొకసారి అమెరికా వాతావరణ సమాచారం మొబైల్ యాప్‌లలో అప్‌డేట్ చేసి ఇస్తుంది. దీన్నిచూసి ప్రజలు జాగ్రత్తపడతారు. ఇండియాలో ఈ సంస్కృతి తక్కువ.
వాతావరణ సమాచారంలో కచ్చితత్వం పెరగాలంటే ఏం చేయాలి?
ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా డేటా ప్రాసెసింగ్ అధికంగా చేయాలి. భారత్‌లో ప్రధానంగా రాడార్ డాప్లర్లు కేవలం 34 ఉన్నాయి. వచ్చే అయిదేళ్లలో మరో 19 ఏర్పాటుచేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వీటి సంఖ్య ఎక్కువై వాతావరణంపై పరిశీలన పెరిగితే.. మరింత వేగంగా కచ్చితమైన అంచనాలు ఇవ్వవచ్చు. మనదేశ పరిస్థితులనుబట్టి ప్రతి 575 కిలోమీటర్ల వైశాల్యానికి ఒక వాతావరణ కేంద్రం ఉండాలి. భవనాలతో నిండి ఉండే నగరాల్లో ప్రతీ 20 కి.మీ.లకు ఒకటి ఏర్పాటుచేయాలి.
జులైలోనే కుంభవృష్టి, వరదలు వస్తున్నాయి?
ఇందుకు వాతావరణ మార్పులే కారణం. కొన్ని ప్రాంతాల్లో గతంలోనూ మెరుపు వరదలు వచ్చాయి. ఈ ఏడాది జులైలోనే ఎక్కువగా తెలంగాణలో ఇలా కురవడం అరుదు. ఈసారి రుతుపవనాలు జులైలోనే చురుగ్గా కదులుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్(ఉష్ణతాపం) ఎక్కువవుతోంది. దీనిప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. వెబ్ స్పెల్, డ్రైస్పెల్ రావడం సహజం. కానీ వాతావరణ మార్పుల వల్ల ఒకే ప్రాంతంలో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి పడటంతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. ఇది ఉష్ణతాపానికి ప్రత్యక్ష నిదర్శనం.
వాతావరణంపై మరింత మెరుగైన సమాచారం ఇవ్వాలంటే..
మారుమూల గ్రామాల్లోనూ టీవీలు, రేడియోలు, ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి స్థానిక భాషల్లో 3 గంటలకొకసారి వాతావరణ హెచ్చరికలు జారీచేయాలి. సంబంధిత సమాచారాన్ని ఫోన్లలో సంక్షిప్త సందేశంగా పంపాలి. దీనివల్ల మారుమూల గ్రామాలకు వేగంగా సమాచారం వెళుతుంది. అన్నిరకాల మీడియా, ప్రైవేటు సంస్థలు, వర్సిటీలు వాతావరణ మార్పులపై కలసికట్టుగా పనిచేయాలి. తద్వారా ప్రజలకు వేగంగా కచ్చితమైన సమాచారం ఇస్తే ఆస్తి, ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం మధ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ప్రస్తుతం వేడిగాలులు వీస్తున్నాయి. ఈ సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వేగంగా అందిస్తున్నారు.
అమెరికా లాంటి దేశాల కన్నా.. మనం వాతావరణ సమాచారం ఇవ్వడంలో ఎందుకు వెనుకబడి ఉన్నాం?
కొన్ని విషయాల్లో మాత్రమే అమెరికాలాంటి దేశాలు మనకన్నా ముందున్నాయి. తుపాన్ల రాక అంచనాపై మనం కూడా మెరుగ్గా ఉన్నాం. అమెరికాలో రాడార్ డాప్లర్లు, వాతావరణ కేంద్రాల సంఖ్య 159 ఉన్నాయి. వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అక్కడి ప్రైవేటు సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి.
ఈ మార్పులను ఎలా పసిగట్టాలి?
అమెరికాలో ఉపగ్రహాల ద్వారా ప్రతీక్షణం సేకరించే సమాచారాన్ని లోతుగా విశ్లేషించి తద్వారా వాతావరణ సమాచారం ప్రజలకు చేరవేస్తున్నారు. అక్కడి విశ్వవిద్యాలయాలకు సొంత రాడార్లు, డేటా ప్రాసెసింగ్ కేంద్రాలున్నాయి. మనదేశంలోని వర్సిటీల్లోనూ రాడార్ డాప్లర్లు, వాతావరణ కేంద్రాలు స్థాపించి.. లోతైన అధ్యయనం చేయాలనే ఆలోచనలు ఉండవు. అమెరికా, జపాన్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల వర్సిటీలు వాతావరణ మార్పులకు ఎంతో ప్రాధాన్యమిచ్చి కొత్త కోర్సులు పెడుతూ యువతను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇక్కడ కూడా అదే రకమైన కృషి జరగాలి.