రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల అద్దెల పై 108 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 2553 మద్యం దుకాణాలకు గానూ రివర్స్ టెండరింగ్ ద్వారా 108.84 కోట్లు ఆదా అయ్యిందని వెల్లడించారు. 2019-20 లో షాపులకు 671.04 కోట్ల రూపాయల అద్దెను చెల్లించామని .. రివర్స్ టెండరింగ్ ద్వారా 2020-21 కి కేవలం 562.2 కోట్ల రూపాయిలు చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. 16.22 శాతం ప్రభుత్వం నిధులు ఆదా చేసినట్టు తెలిపారు.
సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా మద్యపాన నిషేదం చేస్తున్నామని మంత్రి అన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో అధిక అద్దెలకు షాపులు తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ కు వివరించామని ఆయన ఆదేశాల మేరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టి నిధులు ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 43 వేల బెల్టు దుకాణాలు తొలగించి మాట నిలబెట్టుకున్నామని చెప్పారు.మద్యపాన నిషేధ కార్యక్రమం అమలు వల్ల నేరాలు, రోడ్డు ప్రమాదాలు 70 శాతం మేర తగ్గాయన్నారు. వాణిజ్య పన్నుల శాఖ లో రెవెన్యూ వసూళ్ళ లక్ష్యాలను సాధిస్తున్నామని.. అక్టోబరు - డిసెంబరు కాలానికి విధించుకున్న లక్ష్యాల్లో 513 కోట్లు వసూళ్లయ్యాయని తెలిపారు.