కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో నెలల తరబడి బార్లు మూతపడటంతో అక్కడ మిగిలిపోయిన బీర్లను.. బార్ లైసెన్సుదారుల వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల్లో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా బీరును తయారీ తేదీ నుంచి ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత దాన్ని కాలం చెల్లినదిగా భావిస్తారు.
కాలం చెల్లిన సరకు అమ్మకాలపై ఎక్సైజ్‌శాఖ నిర్వాకం - కాలం చెల్లిన సరకు అమ్మకాలపై ఎక్సైజ్‌శాఖ నిర్వాకం
'కాలం చెల్లిన బీర్లైనా సరే వాటి నమూనాలను ప్రయోగశాలల్లో విశ్లేషించిన తర్వాత వినియోగానికి పనికొస్తాయని తేలితే మద్యం దుకాణాల్లో అమ్మేయండి' అంటూ గతంలో ఆదేశాలిచ్చిన ఎక్సైజ్‌శాఖ చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. అత్యధిక బీర్లు అమ్ముడైపోయి వేలాది మంది వాటిని వినియోగించేసి, విమర్శలు వెల్లువెత్తిన తర్వాత 20 రోజులకు ఇప్పుడు తాపీగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. కాలం చెల్లిన బీర్లు ఎక్కడైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రయోగశాల విశ్లేషణల్లో వినియోగానికి పనికొస్తాయని తేలినా సరే వాటిని అమ్మొద్దని నిర్దేశించింది.
అయితే మార్చిలో లాక్డౌన్ విధించే నాటికి బార్లలో అంతకు నెల రోజుల ముందే తెచ్చిపెట్టుకున్న బీర్ల నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. జులై నాటికే వీటికి కాలం చెల్లింది. వీటిని పక్కన పెట్టాల్సిన ఎక్సైజ్‌శాఖ ఆదాయార్జనే లక్ష్యంగా.. వాటి అమ్మకాల కోసం కొత్త మార్గాన్ని వెతికింది. కాలం చెల్లిన బీర్ల నమూనాలను ప్రయోగశాలకు పంపించి అక్కడ విశ్లేషణల్లో వినియోగానికి అనుకూలమని తేలితే దుకాణాల్లో విక్రయించాలని పేర్కొంటూ ఆగస్టు 19న ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని రోజులుగా ప్రకాశం, కడప, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కాలం చెల్లిన బీర్ల విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుటం, విమర్శలు రావటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటూ కాలం చెల్లిన బీర్లు విక్రయించొద్దంటూ సోమవారం ఆదేశాలిచ్చింది.