సాక్షాత్తూ రాష్ట్ర సచివాలయంలోనే దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి తీవ్ర అవమానం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఆయన అధికారిక పర్యటనకు సంబంధించిన ఓ చిత్రాన్ని అధికారులు ఫొటో ఫ్రేముగా చేయించారు. ప్రస్తుతం దాన్ని సచివాలయంలోని నాలుగో బ్లాక్లో చెత్తలో ఉండటం వెలుగులోకి వచ్చింది.
గతంలో ఆయన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి విశాఖ వచ్చిన సమయంలో ఆయన్ను విమానాశ్రయంలో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులు , నౌకాదళ అధికారులు ఆహ్వానిస్తున్న సమయంలో తీసిన చిత్రాన్ని సచివాలయంలో ఉంచారు. ప్రభుత్వం మారటంతో ప్రస్తుతం ఆ చిత్రపటం చెత్తలోకి చేరింది. ఆ ఫోటోను గోడలకు తగిలించకపోయినా... కనీసం స్టోర్ లో అయినా భద్రపరచకుండా చెత్తలో పారవేయటంపై సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.