KVP Ramachandra Rao Letter To CM: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్‌కు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడంతో పాటు పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికే అప్పగించారని, ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఈ బాధ్యతను వదిలి వేసిందని లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టుల విషయం పక్కన పెడితే,.. పోలవరానికి ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత కూడా కేంద్రం వదిలి వేసిందని మండిపడ్డారు. బాధ్యత కూడా రాష్ట్రానికి వదిలివేసి చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర నిర్లిప్తత కారణంగా ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయని కేవీపీ గుర్తు చేశారు.
అన్ని రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చగల బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం విషయంలో.. ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల వైఖరి దురదృష్టకరమన్నారు. ఈ నెల 6న ఒడిశా రాష్ట్రం వేసిన కేసులో సుప్రీంకోర్టు కేంద్రం తీరును తప్పుపట్టిందన్నారు. పోలవరం విషయంలో భాగస్వాములతో మాట్లాడాలని సుప్రీం పేర్కొందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖ ఈ నెల 29న ఈ రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం జరపాలని నిర్ణయించిందన్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఈ రాష్ట్రాలతో సమావేశం జరపడం ఇది మొదటిసారి కాదని,.. 2006 నుంచి ఈ సమావేశాలు సాధారణంగా మారిపోయాయని వాపోయారు.