తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవస్థానం రథం దగ్ధమైన ఘటనలో కుల, మత రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో అంతర్వేది ఉందని తెలిపారు. ఆయన జనసేన అధినేత పవన్ను ఎదిరించటం వల్లే అక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నాయకులు కుల రాజకీయాలు చేస్తున్నారని హర్ష కుమార్ విమర్శించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు ఆదేశించారని.. అదే సీతానగరం మండలంలో దళిత యువకుడు శిరోముండనం వ్యవహారంపై మాత్రం నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే తక్షణం శిరోముండనం ఘటనలపైనా సీబీఐ విచారణకు ఆదేశించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.