మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత శిద్దా రాఘవరావు వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్ను కలిసి మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో వైకాపాలో చేరుతారా...? లేదా చేరేందుకు సమయం కోరతారా..? అనే విషయంపై బుధవారం స్పష్టత వస్తుందని వైకాపా వర్గాలు తెలిపాయి.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జిల్లాలో సత్తా చాటాలని భావిస్తోన్న వైకాపా.. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే తెదేపా ఎమ్మెల్యే కరణం బలరాం సీఎం జగన్ను కలిసి వైకాపాకు మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలోనే శిద్దా రాఘవరావు వైకాపాలో చేరాలనుకున్నా అప్పట్లో సాధ్యపడలేదు. అదే సమయంలోనే ఆయన సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.