Mohammed fariduddin passes away: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెరాస నేత మహమ్మద్ ఫరీదుద్దీన్ (64) కన్నుమూశారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. బుధవారం రాత్రి అక్కడే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధి హోతి(బి) గ్రామంలో జన్మించిన ఫరీదుద్దీన్ విద్యాభ్యాసం అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. స్వగ్రామంలో సర్పంచిగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో రెండోసారి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మైనారిటీ సంక్షేమం, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెరాసలో చేరారు. 2016లో తెరాస తరఫున శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. ఫరీదుద్దీన్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.